గ్రోజ్నీకి వెళ్తున్న విమానం నిన్న కుప్పకూలడంతో మొత్తం 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసినదే. అయితే అజర్‌బైజాన్ రాజధాని బాకు నుంచి కాప్సియన్ సముద్రం పశ్చిమతీరంలోని గ్రోజ్నీకి వెళ్తున్న విమానం నిన్న కుప్పకూలడానికి ముందు విమానంలోని ప్రయాణికుడు ఒకరు తీసిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. కాస్పియన్ సముద్రం తూర్పుతీరంలోని గ్యాస్ హబ్ అయిన అకటులో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 38 మంది మృతి చెందగా 32 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
విమానం కూలిపోతుందని తెలిసిన క్షణంలో ప్రయాణికుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఒక ప్రయాణికుడు ‘అల్లాహు అక్బర్’ అంటూ పదేపదే ప్రార్థన చేస్తూ వీడియోను చిత్రీకరించాడు. ఆయన ముఖంలో ఆందోళన కనిపించింది.

సీట్ల మధ్య మృతదేహాలు
కేబిన్‌లో చిత్రీకరించిన మరో వీడియోలో విమానం సీలింగ్ కుప్పకూలడం, కాపాడాలంటూ ప్రయాణికులు భయంగా కేకలు వేయడం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు ప్రయాణికుల మృతదేహాలు సీట్ల మధ్య చిక్కుకోవడం కనిపించింది. విమానం కూలిన తర్వాత ఈ వీడియోను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. కొన్ని ఆర్మ్‌రెస్ట్‌లపై రక్తపు మరకలు కూడా కనిపించాయి.
జాతీయ సంతాపం దినం
కాగా, ఈ ఘటన నుంచి 32 మంది ప్రాణాలతో బయటపడినట్టు అజర్‌బైజాన్ అధికారులు తెలిపారు. విమాన ప్రమాదంపై అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇహమ్ అలియేవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేడు జాతీయ సంతాపం దినంగా ప్రకటించారు. రష్యాలో జరగనున్న కామన్వెల్త్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సీఐఎస్) అనధికారిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాల్సి ఉండగా, పర్యటనను రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు.