విజయ్ హజారే ట్రోఫీ 2024లో బీహార్ వర్సెస్ మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక ఘనతను అందించింది.13 ఏళ్ల కుర్రాడైన వైభవ్ లిస్ట్-ఏ క్రికెట్‌లో తన అరంగేట్రంతో రికార్డులు తిరగరాసాడు. చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్రాడు, ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి సృష్టించాడు.బీహార్ తరపున 13 సంవత్సరాల 269 రోజుల వయస్సులో లిస్ట్-ఏ మ్యాచ్ ఆడిన అతను, 24 ఏళ్ల నాటి అలీ అక్బర్ రికార్డును బద్దలు కొట్టాడు.అలీ అక్బర్ 1999-2000 సీజన్‌లో విదర్భ జట్టుకు 14 సంవత్సరాల 51 రోజుల వయస్సులో అరంగేట్రం చేశాడు.ఇక వైభవ్ ఈ అరుదైన రికార్డును మరింత కురచ వయసులో సొంతం చేసుకుని భారత క్రికెట్‌కు మరింత వెలుగు జోడించాడు.వైభవ్ తన ఇన్నింగ్స్‌ను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాడు.మొదటి బంతికే చక్కటి ఫోర్ కొట్టి అందరినీ ఆకట్టుకున్నాడు.కానీ,ఆ ఆరంభాన్ని పెద్ద ఇన్నింగ్స్‌గా మలుచుకోవడంలో విఫలమయ్యాడు.
రెండో బంతికే వికెట్ కోల్పోయి రెండు బంతుల్లో నాలుగు పరుగులతో పెవిలియన్ చేరాడు.ఈ మ్యాచ్‌లో బీహార్ జట్టు 46.4 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది.అయితే,ప్రత్యర్థి జట్టు మధ్యప్రదేశ్ కేవలం 25.1 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకొని విజయంతో టోర్నీని ప్రారంభించింది.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలంలో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచిన వైభవ్‌ను చాలా జట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ.1.1కోట్లకు సొంతం చేసుకుంది.అంతేకాదు,వచ్చే ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ అరంగేట్రం చేస్తే ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా మారే అవకాశముంది.వైభవ్ సూర్యవంశీ ఇటీవల అండర్-19 ఆసియా కప్‌లో కూడా ప్రదర్శన ఇచ్చాడు.ఈ టోర్నీలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డును సొంతం చేసుకున్నాడు.చిన్న వయసులోనే ఇలా వరుసగా రికార్డులను తిరగరాస్తున్న వైభవ్,భారత క్రికెట్ భవిష్యత్తుకు ఒక వెలుగువీధిగా మారుతున్నాడు.