సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. మార్కూర్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి హైదరాబాద్ నగరానికి చెందిన ఐదుగురు యువకులు మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన యువకులంతా 20 ఏళ్లలోపే వారే కావడం గమనార్హం. మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.

హైదరాబాద్ నగరానికి చెందని ఏడుగురు యువకులు శనివారం కొండపోచమ్మ సాగర్‌కు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వారిలో ఐదుగురు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సెల్ఫీ తీసుకునే క్రమంలో అదుపుతప్పి డ్యాంలో పడి వీరంతా మృతి చెందినట్లు తెలిసింది. కాగా, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. మృతులు హైదరాబాద్ నగరానికి చెందిన దనుష్(20), లోహిత్ (17), దినేశ్వర్ (17), జతిన్ (17), శ్రీనివాస్ (17)గా గుర్తించారు. మృతి చెందిన ధనుష్, లోహిత్ ఇద్దరూ సొంత అన్నదమ్ములు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పండగ ముందు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు.