Yugal Yadav: క్షుద్రపూజల కోసం వృద్ధుడి బలి ఈ ఘటన బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.దారుణమైన ఈ సంఘటన క్షుద్రపూజల పేరుతో ఓ వృద్ధుడి బలి తీసుకుంది.65 ఏళ్ల యుగల్ యాదవ్‌ను కొందరు దుండగులు హత్య చేసి, అతని తలను వేరు చేసి, మిగతా శరీరాన్ని మంటల్లో కాల్చేశారు.పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు.అయితే ఈ ఘోరానికి మూలకారణమైన తాంత్రికుడు ఇంకా పారిపోయి ఉండగా, అతని బంధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బాధితుడు యుగల్ యాదవ్ బీహార్‌లోని గులాబ్ బిఘా గ్రామానికి చెందిన వృద్ధుడు. మార్చి 13న అతను మదన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.అతని ఆచూకీ కోసం పోలీసులు అన్వేషణ జరుపుతుండగా, పొరుగున ఉన్న బంగార్ గ్రామంలో హోలీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘హోలికా దహన్’ బూడిదలో కొన్ని మానవ ఎముకలను గుర్తించారు. ఈ విషయం అనుమానాస్పదంగా మారింది.

పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించగా, కాలిపోయిన ఎముకలు, చెప్పులు లభించాయి. అవి యుగల్ యాదవ్‌వేనని నిర్ధారించుకున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. శునకాలు నేరుగా రామశిష్ రిక్యాసన్ అనే తాంత్రికుడి ఇంటికి వెళ్లాయి.కానీ అతను అప్పటికే పారిపోయి ఉన్నాడు. దీంతో అతని బంధువైన ధర్మేంద్రను అదుపులోకి తీసుకుని ప్రశ్నించసాగారు. ధర్మేంద్రను విచారించగా అసలు నిజాలు బయటికొచ్చాయి. అతడు తనతో పాటు మరికొందరు కలిసి యుగల్ యాదవ్‌ను కిడ్నాప్ చేసినట్టు ఒప్పుకున్నాడు. అంతేకాక, తాంత్రికుడు క్షుద్రపూజల కోసం యాదవ్ తలను వేరు చేసి, అతని శరీరాన్ని హోలికా దహన్ మంటల్లో వేసినట్టు వివరించాడు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు సమీపంలోని పొలాల్లో తనిఖీ నిర్వహించగా, యాదవ్ తల అక్కడ లభించింది.
విచారణలో మరో షాకింగ్ విషయం బయటపడింది. సంతానం కోసం తాంత్రికుడి వద్ద ఆశ్రయం పొందిన సుధీర్ పాశ్వాన్ అనే వ్యక్తి కోసం ఈ పూజలు నిర్వహించారని పోలీసులు తెలిపారు. తాంత్రికుడు యుగల్ యాదవ్‌ను బలి ఇచ్చాడు.అంతే కాక గతంలో ఓ టీనేజర్‌ను కూడా బలిచ్చినట్టు నిందితుడు ధర్మేంద్ర వెల్లడించాడు.ఇప్పటికే ధర్మేంద్ర, సుధీర్ పాశ్వాన్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాక, ఈ ఘటనలో పాలుపంచుకున్న ఓ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బీహార్‌లో తీవ్ర కలకలం రేపింది. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం పారిపోయిన తాంత్రికుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఈ అమానుష ఘటన గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళన రేపింది. ఇంతటి భయంకరమైన హత్యను ఊహించలేక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాంత్రికుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన తాంత్రికుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే అతన్ని అరెస్ట్ చేసి మరిన్ని నిజాలను వెలికితీసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటనతో మరోసారి క్షుద్రపూజలు,నమ్మకాల పేరిట అమాయకుల బలిదానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సంఘటన భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలను నివారించేలా చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.