విశాఖపట్నం కూర్మన్నపాలెంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు వేతన జీవుల ప్రాణాలను బలిగొంది. వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ అదుపుతప్పి టూవీలర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో టూవీలర్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా జరిగిన ఈ దుర్ఘటన స్థానికులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.
సీసీ కెమెరా ఫుటేజీ
నక్కా కృష్ణ, రాంబాబు అనే ఇద్దరు యువకులు మెడ్ టెక్ జోన్‌లో కాంక్రీట్ పనులు చేస్తున్నారు. దువ్వాడ సెక్టర్-1 సమీపంలోని కొత్తూరులో నివాసముంటున్నారు. వీరిద్దరూ విధులకు వెళ్లి బైక్‌పై తిరుగు పయనమయ్యారు. కూర్మన్నపాలెంలోని బస్సు డిపో ఎదురుగా ఉన్న రోడ్డు మీద యూటర్న్ తీసుకుంటున్నారు. ఇదే సమయంలో అనకాపల్లి నుంచి గాజువాక వైపు వెళ్తున్న టిప్పర్ లారీ వేగంగా దూసుకువచ్చి రెండు బైక్‌లను ఢీకొట్టింది. ఆ తాకిడికి కృష్ణ, రాంబాబు ప్రయాణిస్తున్న బైక్అప్పుడే యూటర్న్ తీసుకుని ముందుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కిందకు వెళ్లిపోయింది.దీంతో కృష్ణ, రాంబాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో బైక్ కూడా కింద పడడంతో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
కేసు నమోదు
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద తీవ్రతను సీసీ కెమెరాలు పరిశీలించారు పోలీసులు. టిప్పర్ లారీ వేగమే ఇద్దరి ప్రాణాలు తీసేందుకు కారణమైందని నిర్ధారించారు.కుటుంబాలకు పెద్ద దిక్కయిన ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోవడంతోఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

పెద్ద దిక్కులైన కృష్ణ, రాంబాబు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పొట్టకూటి కోసం కష్టపడే వేతన జీవుల ప్రాణాలను అదుపుతప్పిన టిప్పర్ బలిగొనడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, రహదారి భద్రతా నియమాలను పాటించకపోవడం ఈ తరహా ప్రమాదాలకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.