భారత క్రికెట్ వర్గాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ 2025/26 దేశవాళీ క్రికెట్ సీజన్‌లో గోవా తరఫున ఆడాలని నిర్ణయించుకున్నాడు. ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జైస్వాల్, కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు గోవా క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని జీసీఏ అధ్యక్షుడు విపుల్ ఫడ్కే అధికారికంగా ధృవీకరించారు.జైస్వాల్ ఇప్పటికే ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) నుంచి నిరభ్యంతర ధృవపత్రం (NOC) పొందాడు. గతంలో సిద్ధేశ్ లాడ్ అర్జున్ టెండూల్కర్ కూడా ముంబయి జట్టును వీడి గోవా తరఫున ఆడిన నేపథ్యంలో, జైస్వాల్ కూడా ఆ మార్గాన్ని అనుసరించాడు.ఈ అంశంపై గోవా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విపుల్ ఫడ్కే మాట్లాడుతూ, “యశస్వి జైస్వాల్ ముంబయి క్రికెట్ అసోసియేషన్ నుంచి అధికారికంగా NOC పొందాడు. మా కార్యదర్శి శంభా నాయక్ దేశాయ్ అతనితో టచ్‌లో ఉన్నారు.

వ్యక్తిగత కారణాల వల్ల ముంబయిని విడిచి వెళ్లాలని జైస్వాల్ నిర్ణయించుకున్నాడు” అని వివరించారు. అయితే అతను ముంబయి జట్టును ఎందుకు వీడాల్సి వచ్చిందనే విషయంపై పూర్తి స్పష్టత తనకు లేదని ఫడ్కే తెలిపారు.జైస్వాల్ లాంటి టాలెంటెడ్ ఆటగాడు గోవా జట్టులో చేరడం జట్టుకు గొప్ప శుభవార్త అని ఫడ్కే అభిప్రాయపడ్డారు. “జైస్వాల్ లాంటి గొప్ప క్రికెటర్‌తో కలిసి ఆడే అవకాశం గోవా ఆటగాళ్లకు దొరకడం చాలా గొప్ప విషయం. భారత జట్టు స్థాయి ఆటగాడి నుంచి వారు ఎన్నో అంశాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది” అని ఆయన వివరించారు.ఇదిలా ఉంటే, జైస్వాల్ గోవా తరఫున ఆడేందుకు సిద్ధమైనప్పటికీ, అతను అక్కడ ఎంతకాలం కొనసాగుతాడనే దానిపై ఇంకా స్పష్టత లేదు. గోవా క్రికెట్ బోర్డు ఈ ఒప్పందాన్ని అధికారికంగా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.