రూఫ్ పైపైన తోట
Modern Farming : కేరళలోని ఎర్నాకుళం జిల్లా పలరివట్టమ్లో ఉంటుంది రెనై మెడిసిటీ హాస్పిటల్. అక్కడ రోగులకు మందులతోపాటు తక్కువ ధరకే తాజా కూరగాయలు అందిస్తారు. పేదలకైతే ఉచితంగానే ఇస్తారు. రోగులకీ, సిబ్బందికీ వండే వంటకోసం అప్పటికప్పుడే కూరగాయలు కోసి తీసుకొస్తారు. అందుకోసం ఎనిమిది అంతస్తుల ఆసుపత్రి రూప్టాప్ మీద కాయగూరలు పండిస్తున్నారు రెనై సిబ్బంది. మూడువేల చదరపు అడుగుల స్థలంలో వారు చేస్తున్న సాగుతో, టొమాటో, బెండ, బీర, దొండ, గోరుచిక్కుడూ, పాలకూర, క్యాబేజీ.. తదితర కాయగూరలు పండిస్తారు.
అక్కడ క్యాంటీన్లో వంటకు ఉపయోగించగా మిగిలినవి సిబ్బందికీ, పేదలకీ ఉచితంగా పంచిపెడతారు. ఇంకా మిగిలితే ఫార్మసీలో మందులు కొనుగోలు చేసేవారికి నామమాత్ర ధరలకు అందిస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందినీ నియమించిన ఆసుపత్రి యాజమాన్యం… రోగులకు సేంద్రియ కాయగూరలతో వండిన ఆహారాన్ని అందించాలని రూఫ్ టాప్ కిచెన్ గార్డెన్కు ఏర్పాటు చేసింది. వచ్చిన చెత్తని కంపోస్టు ఎరువుగా మార్చి, కిచెన్ గార్డెన్ను ఉపయోగిస్తారు. ఆ కూరగాయల తోటలో రకరకాల సమస్యలో రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండే రోగులు ఆహ్లాదంగా గడిపేలా చూస్తుంటారు. ఒకవైపు రోగాల్ని నయం చేస్తూ మరోవైపు ఆరోగ్యాన్ని పెంపొందించే సేంద్రియ కూరగాయలు పండిస్తున్న ఈ హాస్పిటల్ ఆలోచన అదుర్స్ కదూ!

దోమల్ని తరిమేస్తూ
కొచ్చీలోని జనరల్ హాస్పిటల్లో అడుగుపెట్టగానే చేపలు తిరగాడే నీటి తొట్టెలు.. వాటిపక్కనే పైపుల్లో కూరగాయల మొక్కలు కనిపిస్తుంటాయి. నీళ్ల మడుగుల్లో, మొక్కలు ఉన్నచోట దోమలు విపరీతంగా ఉంటాయి. అసలే ఆసుపత్రి వాతావరణంలో దోమల బెడద కూడా ఉందంటే రోగులకు ఎంతో ఇబ్బంది అవుతుంది. అయితే ఆ సమస్యను పరిష్కరించాలనే జనరల్ హాస్పిటల్ సిబ్బంది ఆసుపత్రి పరిసరాల్లో హైడ్రోపోనిక్, ఆక్వాపోనిక్ విధానంలో కాయగూరల్నీ, చేపల్నీ పెంచుతున్నారు. పైగా దోమల లార్వాల్నీ గుడ్లనీ ఆహారంగా తీసుకునే గుప్పి రకం చేపల్నే ఆ తొట్టెలో పెంచుతున్నారు. చేపలు పెరిగిన ఆ నీళ్లను హైడ్రోపోనిక్ సాగుకు వినియోగిస్తూ అక్కడి నుండి వచ్చే వృథా నీటిని మళ్లీ చేపల తొట్టెలోకి మళ్లిస్తున్నారు. ఈ విధంగా మొక్కలకి ఎరువుల అవసరం లేకుండా సాగు చేయడంతోపాటు నీటి వృథానీ అరికడుతున్నారు. దోమల బెడదనీ దూరం చేస్తున్నారు ఆసుపత్రి సిబ్బంది. పలు రకాల ఆకుకూరల్నీ, చేపల్నీ ఈవిధంగా సాగు చేయించి అక్కడ పని చేసే వారికి ఉచితంగా అందిస్తున్నారు. మరోవైపు పరిసరాల్నీ పరిశుభ్రంగా ఉంచుతున్నారు. దోమల సమస్యని సాగుతో భలేగా పరిష్కరించుకుంటున్నారు.

వైద్యులే పండిస్తారు
తమ శాయశక్తులా కష్టపడి రోగుల్ని కాపాడుతుంటారు వైద్యులు. ఆ క్రమంలో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. వారు ఆ ఒత్తిడి నుంచి బయటపడటం ఎంతో అవసరం. బెంగళూరులోని ‘నరటామా అండ్ ఎమర్జెన్సీ కేర్’ హాస్పిటల్ అందుకోసం ఓ ఆలోచన చేసింది. ఆ ప్రభుత్వాసుపత్రి రూఫప్పైన డాక్టర్ల చేత మొక్కల పెంపకం చేపడుతోంది. నిత్యం ఎమర్జెన్సీ కేసులు వస్తుంటాయి ఆ ప్రభుత్వాసుపత్రికి. అక్కడ ఒకవైపు వైద్యుల కొరత.. మరోవైపు రోగుల తాకిడి. ఈ క్రమంలో వైద్యులకు పనిభారం పెరిగిపోతోంది. దాంతో వారు విపరీతమైన ఒత్తిడికి గురవుతుండటంతో ఆ సమస్య నుంచి వారిని బయటపడే యడానికే ఉన్నతాధికారులు రకరకాల పువ్వులూ, పండ్లూ, కాయగూరలూ పెంచేలా అన్ని ఏర్పాట్లు చేశారు. పచ్చని వాతావరణం ఒత్తిడిని తగ్గించి మానసికానందాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి వైద్యులు డ్యూటీలో ఉండగానే ఏదో ఒక సమయంలో మొక్కల సంరక్షణ చూసుకుంటూనే పువ్వులూ, పండ్లు, కాయగూరలూ కోయడం వంటివి చేసేలా చూస్తున్నారు. అక్కడ పండిన కాయగూరల్నీ, పండ్లనీ వైద్యులకు అందించి పువ్వులను మాత్రం స్థానిక ఆలయాలకు పంపిస్తుంటారు.(Modern Farming)