Vastu For Relationship : ఆఫీసు టైం అయ్యాక భర్త నేరుగా ఇంటికి రావాలని భార్య కోరుకుంటుంది. అలాగే (భార్య కూడా ఉద్యోగస్తురాలయితే) భర్తా కోరుకుంటాడు. ఇంట్లో పిల్లలు కూడా తండ్రి సాయంత్రం త్వరగా ఇంటికి రావాలని ఎదురు చూస్తుంటారు. ఏవో అనుకోని పని వత్తిడుల వల్లగానీ, మరేదయినా కారణాల వల్లగానీ సమయానికి ఇల్లు చేరకపోవడం సర్వసాధారణం. అలాంటి సమస్యలకు కూడా వాస్తులో పరిష్కారం వుందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. మీరూ ప్రయత్నించి చూడండి.
ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటికి తూర్పు భాగం కంటే పశ్చిమ భాగంలో కాంపౌండ్ గోడలోపల (Compound Wall) తక్కువ స్థలాన్ని వదలాలన్నది వాస్తు నియమం. అలా వదిలిన ఇళ్లల్లో యజమానులు సాయంత్రాలు ఇంటికి త్వరగా వస్తుంటారు. సెలవుల్లో ఎక్కువ సమయం ఇంట్లో గడుపుతారు. ఒకవేళ కాంపౌండ్ వాల్స్ లేని ఇళ్లు వుంటే ఏం చేయాలి? అనే ప్రశ్న వెంటనే వస్తుంది. దానికి చిన్న సర్దుబాటు చేసుకోవచ్చు.
యజమాని బెడ్ రూమ్ నైరుతి భాగంలో వున్న గదిలో నైరుతి మూలన ఏర్పాటు చేయాలి. తల దక్షిణం వైపు పెట్టి పడుకోవాలి. నైరుతి మూలలోనే బీరువా పెట్టడం వలన పూర్తి నైరుతి మూలకు మంచాలు వేసుకునేందుకు ఒక్కోసారి వీలుపడదు. అందుకని మంచాలను అటు ఇటుగా సర్దుకుంటారు. అప్పుడు మంచాలకు మూడు వైపులా ఎంతో కొంత ఖాళీ స్థలం ఏర్పడుతుంది. మంచాలు దక్షిణ గోడకు ఆనుకుని వున్నట్లయితే మంచాలకు తూర్పున ఏర్పడ్డ ఖాళీ స్థలం కంటే పశ్చిమాన ఏర్పడ్డ ఖాళీ స్థలం తక్కువ వుండేలా చూసుకోవాలి. ఒకవేళ మంచాలు పశ్చిమ గోడను ఆనుకొని వున్నట్లయితే మంచాలకు ఉత్తరాన ఏర్పడ్డ ఖాళీ స్థలం కంటే దక్షిణాన వున్న ఖాళీ స్థలం తక్కువ వుండేలా చూసుకోవాలి. ఖర్చులేని ఇలాంటి పనులు చేయడం సులభం కనుక ప్రయత్నించి చూడవచ్చు.
పెద్దల పటాలు ఇంట్లోకి ప్రవేశించగానే ఎదురుగా పెద్దల (చనిపోయినవారి) పటాలు కనిపించేలాగా పెడుతుంటారు. పెద్దల మీద ప్రేమ మంచిదేగానీ ఆ పటాలను మొదటి గదిలో కాక లోపలి గదుల్లో పెట్టుకోవడం సరైన పద్ధతి. ఇంట్లోకి ప్రవేశించగానే ఎదురుగా ఏదయినా దేవుని పటం కనిపించేలా గున ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి ద్వారాల పైన, ద్వారాలకు ఎదురుగా లక్ష్మీదేవి పటాన్ని పెట్టడం వల్ల లక్ష్మీ చలనం కనుక లక్ష్మీదేవి పటాన్ని సాధ్యమయినంత వరకు పూజామందిరాల వరకు మాత్రమే పరిమితం చేసుకోవాలి.
కొంత మంది ఇళ్లల్లో పూజా మందిరాల్లోనే పెద్దల ఫొటోలు పెట్టి పూజ చేస్తుంటారు. ఇది కూడా సరైన పద్ధతి కాదు. ఆ ఫొటోలను లోపలి గదుల్లో తూర్పు లేదా ఉత్తరపు గోడలకు అమర్చుకోవడం తప్పనిసరి. ఇళ్లల్లో దుప్పి కొమ్ములు, పులి తల మొదలయిన అలంకార ప్రాయంగా అమర్చుకోవడం వాళ్ల అలంకార పిపాసను తెలుపుతుందేమో కానీ వాళ్ల కుటుంబం మీద బాధ్యతారాహిత్యాన్ని కూడా తెలుపుతుంది. జంతువులు కొమ్ములు, తలలు మొదలయినవి ఇంట్లో పెట్టుకోకూడదు. జింకచర్మం లాంటివి కూడా పూజా సమయంలో ఆసనానికి మాత్రమే ఉపయోగించాలి. కానీ గోడల మీద అలంకారం కోసం కాదు.
సీలింగ్ డిజైన్స్ లో సీలింగ్ నుండి కిందకి ఒక అంగుళం మేర బొడిపెలు గానీ, సూదుల్లాగానీ పొడుచుకువచ్చేలా సీలింగ్ అలంకరించడం ఆ ఇంట్లో నివసించేవాళ్లను మానసిక ఆందోళనకు గురి చేస్తుందనడంలో సందేహం లేదు. సీలింగ్ నున్నగా వుండాలి.
బెడ్ రూమ్ లైట్ల విషయంలో కూడా ఒక జాగ్రత్త వహించడం మంచిది. ఎరుపు రంగు బెడ్ లైట్ సర్వదా శ్రేయస్కరం. నీలం, పసుపు, ఆకుపచ్చ రంగు వెలుతురు అందరి ఆరోగ్యానికి సరిపడేవి కాదు. సరిపడని వెలుతురులో పడుకోవడం వల్ల చెడు స్వప్నాలు రావడం, చర్మం పొడారిపోయినట్లు కనిపించడం, మనిషి బరువు కోల్పోతూ అనారోగ్యం పాలవడం, మానసిక ఒత్తిడులకు గురికావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఏ రంగు వెలుతురు సరిపోతుందో గమనించుకొని అదే వాడాలి. లేదా మిల్కీ బల్బ్ వాడుకోవచ్చు.(Vastu For Relationship)