తూర్పు ముఖద్వార దుకాణాల్లో యజమాని కూర్చోవడానికి అనువయిన స్థలాలు నైరుతి, ఆగ్నేయాలు. దుకాణానికి తూర్పున రోడ్డు వున్నప్పుడు సహజంగా ఆ దుకాణం తూర్పు ముఖ ద్వార దుకాణం అవుతుంది. దుకాణానికి ముఖ ద్వారం దగ్గర కూర్చోవడం అవసరమయిన వ్యాపారం అయితే ఆ దుకాణంలో ఆగ్నేయ భాగంలో యజమాని కూర్చోవాలి. ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోకూడదు. ఆగ్నేయంలో తూర్పు ముఖ ద్వారాన్ని అంటకుండా ఉత్తరానికి అభిముఖంగా దక్షిణ గోడను తాకి కూర్చునేలా కుర్చీ ఏర్పాటు చేసుకోవాలి. ఆగ్నేయం తూర్పున గ్లాస్ పార్టిషన్ ను, గోడగానీ వున్న వుంటే ఆ పార్టిషన్నిగానీ, గోడనుగానీ తాకకుండా ఒకటి నుండి మూడు అడుగుల లోపు స్థలాన్ని వదిలి దక్షిణ ఆగ్నేయపు గోడను ఆనుకుని కూర్చోవాలి. కొన్ని దుకాణాల్లో ఇదే స్థలంలో కూర్చున్నప్పటికీ లోపల పనివాళ్ల మీద నిగరాని చేస్తూ పశ్చిమానికి అభిముఖంగా కూర్చుంటారు. అది సరైంది కాదు. గల్లాపెట్టెను తనకు ఎడమ వైపుకు పెట్టుకుని ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి. ఒకవేళ తూర్పుకే ముఖం చేసి కూర్చోవాల్సిన అవసరం వస్తే గల్లాపెట్టెను తనకు కుడివైపు అమర్చుకోవాలి. అరుగు కట్టుకొని కూర్చోకూడదు. కింద కూర్చోవచ్చు లేదా టేబుల్, చైర్ వేసుకొని కూర్చోవచ్చు. అదే ముఖద్వారం వున్న దుకాణంలో యజమాని షాపులోపలి వైపు కూర్చోవలసి వస్తే నైరుతి భాగంలోనే కూర్చోవాలి. వాయువ్యం వైపు కూర్చోకూడదు. నైరుతి స్థానంలో కింద కూర్చోవలసి వస్తే అరుగులు నిర్మించుకుని పైన కూర్చోవచ్చు. కింద కూర్చోకూడదు. చైర్, టేబుల్ వేసుకుని కూర్చోవచ్చు. ఉత్తరాభిముఖంగా కానీ, తూర్పుకుఅభిముఖంగా కానీ కూర్చోవాలి. మరో దిక్కుకు అభిముఖంగా కూర్చోవడం సరైన పద్ధతి కాదు. నైరుతిలో ఉత్తరాభిముఖంగా కూర్చుంటే గల్లాపెట్టెను తన ఎడమ చేతి వైపుకు, తూర్పుకు అభిముఖంగా కూర్చుంటే గల్లా పెట్టెను తన కుడిచేతి వైపుకు వుంచేలా అమర్చుకోవాలి.
నైరుతిలో తూర్పుకు అభిముఖంగా కూర్చునే విధానం
నైరుతిలోగానీ, ఆగ్నేయంలోగానీ కూర్చునే దుకాణ యజమానులు తమ వెనుక గోడ మీద దేవుని పటాలు పెట్టి పూజించడం సాధారణంగా జరుగుతుంటుంది. ఏ దుకాణంలోనైనా ఈశాన్యమే పూజకు ప్రధానమైన, శ్రేష్ఠమైన స్థలం. తూర్పు ముఖద్వార దుకాణంలో తూర్పు ఈశాన్యం ముఖ ద్వారానికి ఆనుకొనే ఉంటుంది. అక్కడ తూర్పున తెరిపి ఉంటుంది. కనుక పూజ కోసం పటాలు పెట్టడం వీలు కుదరకనప్పుడు ఉత్తర ఈశాన్యంలో దేవుని పటాలు పెట్టి దీపారాధన చేయాలి. యజమాని తాను కూర్చున్న చోట గోడకు దేవుని పటాలు పెట్టుకోవచ్చు. కానీ ప్రతిరోజూ మొదటి పూజ ఈశాన్యంలో చేసిన తర్వాతే తను కూర్చున్న స్థలంలో ఏర్పరచుకొన్న పటాలకు పూజ చేయడం మంచిది.
షట్టర్స్
తూర్పున ఒకటికన్నా ఎక్కువ షట్టర్స్ ఉంటే ఉదయం దుకాణం తెరిచేటప్పుడు మొదట ఈశాన్యం వైపున వున్న షట్టర్ ఒకటిని తెరవాలి. ఆ తర్వాతే తూర్పు, ఆగ్నేయాలలో(2, 3) వున్న షట్టర్స్ ని క్రమంగా తెరవాలి. దుకాణాన్ని రాత్రి మూసివేసే సమయాల్లో మొదట ఆగ్నేయ భాగంలో వున్న షట్టర్ని (3) మూసివేయాలి. ఆ తర్వాతనే తూర్పు, ఈశాన్యాలలో వున్న షట్టర్ని (2,1) క్రమంగా మూసివేయాలి. తూర్పు ముఖ దుకాణాలకు మెట్లు తూర్పుకు వుంటాయి. మెట్లు షాపు నిడివిని పూర్తిగా కవర్ చేస్తూ వుండవచ్చు. కానీ తూర్పు ఆగ్నేయం వైపున మెట్లు వుండి తూర్పు ఈశాన్యం వైపు మెట్లు లేకుండా వుండటం తప్పు. తూర్పున వున్న వీధి వైపు పూర్తిగా విస్తరించిగానీ తూర్పు ఈశాన్యాన్ని కవర్ చేస్తూగానీ, మెట్ల నిర్మాణం వుండాలి. వచ్చిపోయే కస్టమర్స్ నడక తూర్పు ఈశాన్యం నుండి జరగడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Read also: Digvaka Vedha:దిగ్వక వేధ అంటే ఏమిటి?