ఇంటి లోపలగానీ, ఇంటి బయట ప్రహరీలోగానీ మేడపైకి మెట్ల నిర్మాణం గావించేప్పుడు మెట్లు తూర్పుకుగానీ, ఉత్తరానికిగానీ వాలుగా వచ్చేట్టు వుండాలి. అంటే మనం మెట్లు ఎక్కడం ప్రారంభించినప్పుడు మన మొహం పడమరకుగానీ, దక్షిణానికిగానీ వుండాలి.
ఒక వరుస మెట్లు
ఒకే వరుస మెట్లు వేయాల్సి వస్తే తూర్పు నుండి పడమరకు ఎక్కే విధంగా లేదా ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కే విధంగా వేయాలి.
రెండు వరుసల మెట్లు
రెండు వరుసల మెట్లు నిర్మించవలసి వస్తే మొదటి వరుస తూర్పు నుండి పడమరకు వెళ్లే విధంగా వుండి ఆ తరువాత ఎటువైపుకయినా తిరిగి మెట్ల నిర్మాణం గావించాలి. పడమర నుండి తూర్పుకు ఎక్కే విధంగా ఉండాలి. లేదా మొదటి వరుస ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కి, ఆ తరువాత ఎటువైపుకయినా తిరిగి దక్షిణం నుండి ఉత్తరానికి ఎక్కే విధంగా ఉండాలి.
‘ఎల్’ ఆకారంలో మెట్ల
ఆంగ్ల అక్షరం ‘ఎల్’ స్వరూపంలో మెట్ల నిర్మాణం గావించవలసి వచ్చినప్పుడు కూడా మొదట తూర్పు నుండి పశ్చిమానికిగానీ, ఉత్తరం నుండి దక్షిణానికిగానీ ఎక్కి, ఆ తరువాత ఎటువైపుకయినా తిరిగే విధంగా మెట్లు నిర్మించుకోవాలి.
ఒక్క వరుస మెట్లు గృహానికి వెలుపల
ప్రహరీలోపల ఒక్క వరుసమెట్లు నిర్మించాలనుకుంటే ఈశాన్య, ఆగ్నేయ, వాయువ్య, నైరుతి భాగాల్లో నిర్మించుకోవచ్చు. ఈశాన్యంలో మెట్ల నిర్మాణం వాస్తురీతాని నిషేధించబడటం సత్యమేగానీ, ఇంటికి బయట ఇంటితూర్పు ఈశాన్యం, ఉత్తర ఈ గోడకు ఆనుకొని ఎటైనా ఒకవైపు మాత్రమే నేరుగా మెట్ల నిర్మాణం గావించుకోవచ్చు. ఆ మెట్లు ఇంటి ఈశాన్య ప్రహరీగోడలకు తగలకుండా జాగ్రత్త పడాలి. అలా తగలడం వలన ఇంటి ఆవరణలోని ఈశాన్య మూల మెట్ల మూలంగా బరువును సంతరించుకుని దుష్ఫలితాలు కలుగుతాయి. గృహానికి దక్షిణ, పశ్చిమ భాగాల్లోని ప్రహరీ గోడలకున్న మధ్య దూరం కంటే ఉత్తర, తూర్పు భాగాల్లోని ప్రహరీ గోడలకున్న దూరం ఎక్కువగా వుండాలన్న విషయం తెలిసిందే. ఆ ఎక్కువ దూరం మెట్లకు కోసం కేటాయించిన స్థలం తర్వాత మిగిలిన దూరం హెచ్చుగా ఉండాలనే విషయం గుర్తుంచుకోవాలి. దక్షిణంలో మూడు అడుగుల ఖాళీ స్థలం వదిలి, ఉత్తరంలో ఐదడుగుల ఖాళీ స్థలం వదలి.. వదిలిన ఆ ఐదడుగుల ఖాళీ స్థలంలో మూడడుగుల మెట్లు వేస్తే మిగతా.. దూరం రెండడుగులే. అలా దక్షిణంలో వదిలిన స్థలం కంటే ఉత్తరంలో వదిలిన స్థలం తక్కువకు కుదించుకుపోతున్నది. అందువల్ల ముందే ఆలోచించుకుని మెట్ల నిర్మాణం కోసం స్థలం కేటాయించిన తరువాత మిగిలే స్థలం దక్షిణం పశ్చిమాల కంటే ఎక్కువ ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. తూర్పు ఈశాన్యంలో ఒక వరుస మెట్లు ఇంటి తూర్పు గోడనానుకుని ఉత్తరం నుండి దక్షిణానికి మెట్లు కట్టినప్పుడు ఆ మెట్ల నిర్మాణం బాల్కనీలోకి చేరేలా బాల్కనీ తప్పకుండా వేయాలి. బాల్కనీలోకి నడిచి ఇంటిలోకి మధ్య భాగంలో నుండిగానీ, ఉచ్ఛస్థానంలో నుండిగానీ ప్రవేశించేలా తలుపు వుండాలి. మెట్లకు తూర్పు వైపున వదిలిన ఖాళీస్థలం ఇంటికి పశ్చిమాన వదిలిన ఖాళీస్థలం కంటే హెచ్చుగా వుండటం గమనించవచ్చు. ఉత్తర ఈశాన్యంలో ఒక వరుస మెట్లు ఇంటి ఉత్తర గోడనానుకుని ఉత్తర ఈశాన్యంలో తూర్పు నుండి పశ్చిమానికి మెట్ల నిర్మాణం చేసినప్పుడు మెట్లు బాల్కనీలోకి చేరేలా బాల్కనీ తప్పనిసరిగా నిర్మించాలి. మెట్లు ఎక్కిన తరువాత బాల్కనీలోకి చేరి ఇంట్లోని మధ్య భాగంలో నుండిగానీ, ఉచ్ఛస్థానంలో నుండిగానీ ప్రవేశించేలా తలుపును ఏర్పాటు చేసుకోవాలి. మెట్లకు ఉత్తరాన వదిలిన స్థలం, ఇంటికి దక్షిణాన వదిలిన స్థలంకంటే హెచ్చుగా ఉండటం అవసరం.
ఆగ్నేయంలో ఒక్క వరుస మెట్లు
ఆగ్నేయంలో ఒక్క వరుస మెట్లు వేయవలసి వస్తే, ఇంటికి దక్షిణ ఆగ్నేయంలో దక్షిణ గోడను ఆనుకుని తూర్పు నుండి పశ్చిమానికి ఎక్కేలా మెట్ల నిర్మాణం చేసుకోవాలి. మెట్లు బాల్కనీలోకి తీసుకువెళ్లేలా బాల్కనీ నిర్మాణం దక్షిణంలో చేసుకోవలసి వస్తుంది. కాబట్టి విధిగా ఉత్తరం వైపున కూడా బాల్కనీ కాస్త ఎక్కువ వెడల్పుతో నిర్మించుకోవాల్సి ఉంటుంది. పశ్చిమ, తూర్పు వైపులలో బయట కూడా బాల్కనీని పొడిగించుకోవచ్చు.
మెట్లు ఎక్కి బాల్కనీలోకి వెళ్లాక ఇంట్లో మధ్య స్థానం నుండిగానీ, ఉచ్ఛస్థానం నుండిగానీ ప్రవేశించేందుకు అనువుగా తలుపు ఏర్పాటు చేసుకోవాలి. ఒంటి వరుస మెట్లు తూర్పు ఆగ్నేయంలో కట్టుకుంటే గృహంలోకి ప్రవేశించటానికి ఆ మెట్లను పశ్చిమానికి తిప్పి, దక్షిణ ఆగ్నేయ ద్వారం ఉపయోగించవలసి వస్తుంది. అప్పుడు అది ఒంటి వరుస మెట్లుగా కాకుండా ‘ఎల్’ ఆకారపు మెట్లు అవుతాయి.
నేరుగా కట్టిన మెట్లు తూర్పు ఆగ్నేయంలో ఆగిపోతే, ఆ ఇంట్లోకి వెళ్లటానికి ఆగ్నేయ ద్వారమే శరణ్యమవుతుంది. అది నీచస్థానం నడక అవుతుంది. కాబట్టి తూర్పు ఆగ్నేయంలో ఒంటి వరుస మెట్ల నిర్మాణం ఆలోచనను మానుకోవడం మంచిది.
read also: యజమాని కూర్చొనడానికి అనువైన స్థలం?