దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలు మరోసారి అంతరించాయి. ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే, బీమ్ వంటి యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్స్ పనిచేయకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం రాత్రి 7:30 గంటల తర్వాత యూపీఐ ద్వారా లావాదేవీలు జరపలేమని అనేక మంది వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. డిజిటల్ చెల్లింపులకు ఈ అంతరాయం పెద్ద సమస్యగా మారింది.
యూజర్ల అసంతృప్తి
యూపీఐ సర్వీసులు ఆగిపోవడంతో పేమెంట్లు, ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి లావాదేవీల్లో అవాంతరాలు ఎదురయ్యాయి. డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం ఈ సమస్య రాత్రి ప్రారంభమై అనేక గంటల పాటు కొనసాగినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అనేక మంది వినియోగదారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశారు. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడంతో చాలా మంది వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం
ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యాప్ మొరాయించడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు UPI యాప్స్ పని చేయకపోవడం డిజిటల్ బ్యాంకింగ్ పై ప్రభావం చూపింది. రోజువారీ లావాదేవీలు నిర్వహించే వ్యాపారులు, ఉద్యోగులు, సాధారణ వినియోగదారులు ఈ సమస్య వల్ల నష్టపోయారు. మంగళవారం ఇదే తరహా సమస్య తలెత్తినట్లు సమాచారం.

NPCI స్పందన
యూపీఐ సేవల అంతరాయంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పందించింది. “ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా కొన్ని బ్యాంకులు తాత్కాలిక లావాదేవీల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అయితే UPI వ్యవస్థ సాధారణంగా పనిచేస్తోంది. అవసరమైన పరిష్కారం కోసం మేము సంబంధిత బ్యాంకులతో కలిసి పనిచేస్తున్నాం” అని NPCI ప్రకటించింది. యూపీఐ సేవలు త్వరలోనే పునరుద్ధరించబడతాయని పేర్కొంది.