Trump: విదేశాల్లో తయారై యూఎస్‌లో దిగుమతయ్యే కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇది ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తోందని స్పష్టంచేశారు. బుధవారం వైట్‌హౌస్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికాలో తయారుచేయని అన్ని కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నాం. ఈ చర్య శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ తయారయ్యే వాటిపై మాత్రం ఎలాంటి సుంకం ఉండదు. ఈ చర్య మా ఆర్థికవృద్ధిని పెంచుతోంది. మునుపెన్నడూ చూడని వృద్ధిని కొనసాగిస్తుంది. ఏప్రిల్ 2 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి అని ట్రంప్ పేర్కొన్నారు. మొదట చైనా దిగుమతులపై ట్రంప్ 10 శాతం సుంకం విధించగా తర్వాత దాన్ని 20 శాతానికి పెంచారు. ఈ టారిఫ్‌ల విషయంలో ఆ దేశానికి ట్రంప్ ఓ ఆఫర్‌ను ప్రకటించారు.

అవసరమైతే ఒప్పంద గడువును కూడా పెంచుతా
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ ను విక్రయిస్తే.. టారిఫ్‌లు తగ్గించే అవకాశం ఉందన్నారు. అవసరమైతే ఒప్పంద గడువును కూడా పెంచుతానన్నారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టిక్‌టాక్‌ను నిషేధిస్తున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. యూఎస్ నిబంధనలకు కట్టుబడనందున జనవరి 18న ఆ యాప్‌ను ప్లే స్టోర్ల నుంచి గూగుల్ , యాపిల్ తొలగించాయి. దీని నిషేధాన్ని అమలుచేయడంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలస్యం చేయడంతో అమెరికాలోని ఆపిల్, గూగుల్ యాప్ స్టోర్‌లలో టిక్‌టాక్ మళ్లీ ప్రత్యక్షమయ్యింది. ఈ యాప్‌కు అమెరికాలో 170 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ యాప్ కొనుగోలు గురించి ఇటీవల అనేక వార్తలు వచ్చాయి. తొలుత ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ దీన్ని కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆయన దాన్ని ఖండించారు. ‘సావరిన్ వెల్త్‌ఫండ్’ ను సృష్టించాలని అమెరికా ట్రెజరీ, వాణిజ్య విభాగాలను ట్రంప్ ఇటీవల ఆదేశిస్తూ.. కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు.