గతేడాది భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం ప్రకటించగా.. ఆ తర్వాత కాల్పుల విరమణ జరిగింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగింది నా వలనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది అప్పట్లో బ్రేకింగ్ న్యూస్ అయింది. అయితే మళ్లీ ఇప్పుడు కూడా ట్రంప్ పాత రాగాన్ని ఆలపించారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు అణ్వాయుధాల వినియోగం గురించి కూడా ఆలోచించే స్థితికి వెళ్లాయని ఆయన చెప్పారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారిందని ట్రంప్ తెలిపారు. ఆ సమయంలో ఎనిమిది యుద్ధ విమానాలు కూల్చివేశారని.. పరిస్థితి అదుపు తప్పితే భారీ విపత్తు తప్పదని తాను భావించానని తెలిపారు. తన జోక్యం వల్లే ఆ ఘర్షణ పెద్ద యుద్ధంగా మారకుండా ఆగిపోయిందని ట్రంప్ స్పష్టం చేశారు.
Read Also: Davos: ఇజ్రాయెల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
భారత్-పాకిస్తాన్ మధ్య సంఘర్షణ అత్యంత ప్రమాదకరమైనది
తాను అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం పది నెలల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది పెద్ద యుద్ధాలను ఆపానని ట్రంప్ పేర్కొన్నారు. ఆ జాబితాలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ సంఘర్షణ అత్యంత ప్రమాదకరమైనదిగా ఆయన అభివర్ణించారు. రెండు దేశాలు అణ్వస్త్రాలతో సన్నద్ధంగా ఉండటంతో.. ఈ యుద్ధం మొదలైతే లక్షలాది కాదు, కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండేదని చెప్పుకొచ్చారు. గత ఏడాది వాషింగ్టన్‌కు వచ్చిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనతో మాట్లాడుతూ.. ట్రంప్ జోక్యం వల్ల కనీసం కోటి మంది ప్రాణాలు కాపాడుకోగలిగామని చెప్పారని అధ్యక్షుడు వెల్లడించారు. భారత్, పాకిస్తాన్ రెండూ అణ్వాయుధాలు కలిగిన దేశాలే కావడంతో.. ఆ పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారేదో ప్రపంచం అర్థం చేసుకోవాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. నోబెల్ శాంతి బహుమతి గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తన విదేశాంగ విధాన విజయాలు వ్యక్తిగత అవార్డులకంటే ముఖ్యమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, తాను ఆపిన యుద్ధాల సంఖ్యను ప్రస్తావిస్తూ.. వాటిలో ఒక్కటి కూడా మొదలై ఉంటే లక్షలాది మంది ప్రాణాలు పోయేవని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: