భారతదేశంలో దళితులు, ఆదివాసీలు శతాబ్దాలుగా సామాజిక అణచివేతను ఎదుర్కొంటున్న వర్గాలు. దళితులపై దాడులు జరిగిన అనేక సందర్భాల్లో కేసులు నమోదు కావడం లేదన్నది సామాజిక సంస్థలు, హక్కుల సంఘాలు తరచుగా ప్రస్తావించే వాస్తవం. పోలీస్ స్టేషన్ల వద్దే ఫిర్యాదులు తిరస్కరించబడటం, కేసులు నమోదు ఆలస్యం కావడం, లేదా సాధారణ సెక్షన్ల కింద నమోదు వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. కాగా దళితులపై జరిగే అణచివేతను నిరోధించే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ (SC and ST Atrocities Act )చట్టంలోని అంశాలపై కొన్ని తీర్పులను చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ఒక కేసు సందర్భంగా అలహాబాద్హైకోర్టు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఒక వ్యక్తి ఎస్సీ/ఎస్టీ సమాజానికి చెందినవాడైన మాత్రాన కోర్టులు ఆటోమేటిక్గా ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయ మని పోలీసులకు ఆదేశించాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ముందు వచ్చిన అభియోగాలు, ఆధారాలు, పరిస్థితులను పరిశీలించిన తరువాత మాత్రమే పోలీసు దర్యాప్తుకు ఆదేశించాలన్నది ఆ వ్యాఖ్యల సారాంశం. న్యాయపరంగా చూస్తే ఇది ‘న్యాయ విచక్షణ’ కింద చెప్పబడిన వ్యాఖ్య.. భారతీయ సామాజిక వాస్తవాల దృష్టిలో ఇది ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో కోర్టులు కూడా క్రమం గా ప్రజలకు అనుకూలంగా ఉన్న కొన్ని నిర్ణయాలను పరి మితం చేసే తీర్పులు ఇస్తున్నాయనే చర్చ పెరుగుతోంది. అలాంటి నేపథ్యంలోని ఒక ఉదాహరణగా ఇటీవలి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా సామాజిక న్యాయం అంశంపై కొత్త చర్చలకు దారితీసింది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఎస్సీ/ఎస్టీ అని చెప్పడం వల్ల ఎఫ్ఎస్ఐఆర్ తప్పనిసరి కాదు” అనే వ్యాఖ్యలు బాధిత వర్గాల్లో అనిశ్చితిని పెంచే ప్రమాదం ఉంది. ఇప్పటికే కేసులు నమోదు కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దళితులకు ఇది మరింత అడ్డం కిగా మారవచ్చని విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరుచట్టం దుర్వినియోగం కాకుండా ఉండాలని వాదిస్తారు. కానీ భారత దేశంలో ప్రధాన సమస్య దుర్వినియోగం కంటే న్యాయం అందకపోవడమే అని అనేక సంఘాలు చెబుతున్నాయి. గణాంకాలు కూడా ఈ సమస్య తీవ్రతను చూపుతున్నాయి.
Read Also :Raghav Chadha: పెళ్లయిన దంపతులు వేర్వేరుగా పన్ను దాఖలు ఎందుకు?

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బి) నివేదికల ప్రకారం దళితులపై నమోదయ్యే అట్రాసిటీ కేసులు యేటా పెరుగుతున్నాయి. అయితే ఈ కేసుల్లో శిక్షా రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది. అంటే నేరాలు తగ్గడం కాదు, కానీ బాధితులకు న్యాయం అందే ప్రక్రియ బలహీనంగానే ఉం దనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ గణాంకాలు సూచి స్తున్నాయి. అలాంటి పరిస్థితిలో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు ప్రక్రి యను మరింత కఠినతరం చేసే వ్యాఖ్యలు రావడం ఆందో ళన కలిగించేదిగా ఉంది. ఇటీవలి కాలంలో మరో ముఖ్య మైన సామాజిక రాజకీయ పరిణామం కూడా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రారంభమైన ఒక డిమాండ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అది ఏమిటంటే, ఎస్సీ, ఎస్టీ సమాజాలకు ఉన్నట్లే బీసీలకు కూడా ప్రత్యేక అట్రాసిటీ చట్టం అవసరం అనే డిమాండ్. కుల వివక్ష, సామాజిక అవమానాలు బీసీ వర్గాలపై కూడా జరుగుతున్నాయనే వాదనతో ఈ డిమాండ్ బలపడుతోంది. ఎస్సీ, ఎస్టీలకు ఉన్న\ రక్షణాత్మక అట్రాసిటీ చట్టం వల్లే బీసీలు కూడా అలాంటి చట్టాన్ని కోరుతున్నారనే వాస్తవాన్ని అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలు గమనిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ముందుగా ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రక్షణ చట్టాలను బలహీనపరిస్తే భవిష్యత్తులో బీసీలు కూడా అలాంటి చట్టాన్ని డిమాండ్ చేసే పరిస్థితి తగ్గుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రలోని సౌందాల గ్రామంలో గ్రామపంచాయితీ ఒక తీర్మానం చేసి గ్రామంలో కులం, కుల వివక్షను నిషేధిస్తున్నాము” అని ప్రకటించింది. పైకి చూస్తే ఇది ప్రగతిశీల నిర్ణయంలా కని పిస్తుంది. కానీ భారతీయ సామాజిక వాస్తవాలను దృష్టిలో పెట్టుకుంటే దీనిపై కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతు న్నాయి. ఎందుకంటే ఒకవైపు దళితులు, బీసీలు (ఓబీసీలు), ఆదివాసీలు తమ స్వాభిమానాన్ని కాపాడుకుంటూనే కుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నారు. అలాంటి పరిస్థితిలో ‘కులం అనే అంశాన్నే పూర్తిగా నిషేధించాలి” అనే తీర్మానాలు అసలు సమస్య అయిన కుల ఆధిపత్యాన్ని ప్రశ్నించకుండా, అణచివేతకు గురైన వర్గాల గుర్తింపును చెరిపివేయడానికి ఉపయోగపడతాయనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ సంఘటన బీజేపీ పాలిత రాష్ట్రంలో జర గడం కూడా చర్చనీయాంశమైంది.

ఒకవైపు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని(SC and ST Atrocities Act ) పరిమితం చేసే వ్యాఖ్యలు వస్తుంటే, మరోవైపు విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ విద్యార్థులపై కుల వివక్ష ఉండకూడదని యూజీసీ ఇచ్చిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో అగ్రవర్ణ సం ఘాలు నిరసనలు చేపట్టడం కూడా గమనించదగ్గ విష యం. 2025 ప్రారంభంలోనే కొన్ని కోర్టుల తీర్పులు చూస్తే, క్రింది కులాల రక్షణ కోసం రూపొందించిన చట్టాలు, హక్కు లను పరిమితం చేసే విధంగా వ్యాఖ్యలు వస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన ఒక తీర్పు కూడా చర్చనీయాంశమైంది. ఆ తీర్పులో ఎస్సీ / ఎస్టీ వ్యక్తిని కులం పేరుతో బహిరంగంగా అవమానించినప్పుడే అది అట్రాసిటీ కేసుగా పరిగణించవచ్చని వ్యాఖ్యానించబడింది. దీనివల్ల వ్యక్తిగతంగా జరిగే అనేక అవమానాలను చట్ట పరంగా నిరూపించడం కష్టతరం అవుతుందనే విమర్శలు వచ్చాయి. అలాంటి తీర్పుల పరంపరలోనే ఇప్పుడు అల హాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు కూడా కొనసాగింపుగా కనిపి స్తున్నాయని సామాజిక న్యాయం కోసం పోరాడే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పరిస్థితిని భారత రాజ్యాంగ దృష్టితో కూడా చూడాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అస్పృశ్యతను రద్దు చేస్తూ దానిని చట్టవిరుద్ధంగా ప్రకటిం చింది. అలాగే ఆర్టికల్ 15 కులం ఆధారంగా వివక్షను నిషే ధిస్తుంది. చరిత్రపరంగా అణచివేతకు గురైనవర్గాలకు ప్రత్యేక రక్షణ కల్పించడం ఈ రాజ్యాంగ హామీల అసలు ఉద్దేశం. కోర్టులు ఇచ్చే వ్యాఖ్యలు సామాజిక వాస్తవాలను పరిగణన లోకి తీసుకోవాలి. దళితులపై దాడులు ఇంకా జరుగుతున్నసమాజంలో బాధితులకు న్యాయం అందించే పరిస్థితిని తీసుకురావాలి. సామాజిక న్యాయం అనేది కేవలం న్యాయ పరమైన పదంకాదు, అది భారత ప్రజాస్వామ్యానికిప్రాణం. అణచివేతకు గురైనవర్గాల రక్షణ కోసం రూపొందించిన చట్టాలు బలహీనపడితే, భారత రాజ్యాంగంవాగ్దానం చేసిన సామాజిక న్యాయం పునాదులే కదిలే ప్రమాదం ఉంది.
-పాపని నాగరాజు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: