📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Adulterated milk : ఆరోగ్యాన్ని హరిస్తున్న కల్తీపాలు

Author Icon By Sudha
Updated: February 25, 2026 • 5:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాలు ఆరోగ్యానికి పోషకాహారం. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాలు తాగుతుంటారు. టీ, కాఫీ, వంటల్లో ఇలా నిత్యం పాలను వాడుతూనే ఉంటాం. ఎముకల బలం కోసం చిన్నపిల్లలకు ఆ పాలను మరిగించి ఇస్తాం. కానీ అదేపాలు ఈరోజు విషంగా మారుతున్నాయం టే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో కల్తీపాల (Adulterated milk)దందా ఒక చీకటి పరిశ్రమగా విస్తరించింది. డిమాండ్ పెరిగిన చోట దందా పుట్టడం కొత్తేమీ కాదు. కానీ ఆహారంలో, ముఖ్యంగా పాలలో కల్తీ చేయడం మానవత్వాన్ని మించి లాభం చూసే దురాశకు ఉదాహరణ. చిక్కదనం కోసం పామాయిల్, ఉప్పు, మాలో డెక్సిన్, వెన్నశాతం పెరిగిందని చూపించేందుకు యూరియా నిల్వకాలం పెంచేందుకు బోరిక్ యాసిడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, క్లోరిన్, అమ్మోనియం సల్ఫేట్ ఇలా రసాయనాల మిశ్రమంతో కెమికల్ కాక్టెయిల్ తయారు చేసి పాల పేరుతో విక్రయిస్తున్నారు. 100 లీటర్ల పాలలో100 లీటర్లనీరు కలిపి, తెల్లటి నురగ కోసం యూరియా వేయడం వంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి వదంతులు కావొచ్చు, వాస్తవాలు కావొచ్చు. కానీ ఇలాంటి సంఘటనలు వెలుగు లోకి రావడం కూడా పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇలాంటి కల్తీ పాలు (Adulterated milk) తాగడం వల్ల వచ్చే ఆరోగ్యప్రమాదాలు భయానకమైనవి. మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, జీర్ణాశయ సమస్యలు, అతిసారం, అల్సర్లు, కొలెస్ట్రాల్ పెరుగుదల, దీర్ఘకాలంలో క్యాన్సర్ ముప్పు. ఇవి కేవలం వైద్యపుస్తకాలలో ఉండే పదాలు కాదు మన ఇళ్లలోకి చొరబడే వాస్తవాలు. పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల దెబ్బతినే ప్రమాదం మరింత ఆందోళనకరం. కల్తీపాల ఉత్పత్తుల్లో ఈకోలై, సాల్మనెల్లా వంటి ప్రమాదకర బ్యాక్టీరియా, రోటా వైరస్ వంటి సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఒక్క గ్లాసు పాలు ఆరోగ్యం ఇవ్వాల్సింది పోయి ఆసుపత్రి బెడు చేర్చే పరిస్థితి రావడం దురదృష్టకరం.

Read Also: Mamata Banerjee: కేరళకు ఓకే.. బెంగాల్‌కు ఎందుకు కాదు? మమత ఆగ్రహం

Adulterated milk

ఇక్కడ ప్రధాన ప్రశ్న నియంత్రణ వ్యవస్థ ఎక్కడ విఫలమవుతోంది? ఫుడ్ సేఫ్టీ విభాగాలు, స్థానిక అధికారులు, పోలీసులు కల్తీ దందాపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. అప్పుడప్పు డు దాడులు, అరెస్టులు, ట్యాంకుల స్వాధీనం వంటి వార్తలు వస్తున్నాయి. కానీ అవి తాత్కాలిక చర్యలుగానే మిగిలిపోతున్నాయా? కల్తీ మాఫియా కొత్త పేర్లు, కొత్త బ్రాండ్లు, కొత్త మార్గాలతో మళ్లీ పుట్టుకొస్తోంది. కేవలం జరిమానాలు సరిపోవు, కఠిన శిక్షలు, లైసెన్సుల రద్దు, నిరంతర తనిఖీలు, ప్రజలకు పారదర్శక సమాచారంఇవన్నీ సమాంతరంగా జరగాలి. ప్రజల బాధ్యత కూడా అంతే ముఖ్యమైనది. తక్కువ ధరకు ఎక్కువ లాభం అనేది అను మానానికి కారణం కావాలి. వాసన, రుచి, మరిగించినప్పు డు ఏర్పడే పొర, నేలపై చుక్క వేసినప్పుడు కదలిక – ఇవి ప్రాథమిక పరీక్షలు మాత్రమే. కానీ శాస్త్రీయంగా పరీక్షించిన, నమ్మకమైన వనరుల నుంచి పాలు కొనడం ఉత్తమం. స్థానిక రైతుల నుంచి నేరుగా సరఫరా అయ్యే పాలు, విశ్వసనీయ డెయిరీలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన బాండ్లను మాత్రమే ఎంచుకోవడం అవసరం. అనుమానం ఉన్నపుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వడం ప్రతి పౌరుడి కర్తవ్యం. కల్తీ పాలు కేవలం ఆర్థిక నేరం కాదు, ఇది నైతిక పతనం. సమాజం విశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కొల్లగొట్టే దురాగతం. పాలపై నమ్మకం కోల్పోతే అది కేవలం ఒక ఉత్పత్తిపై కాదు ఆహార వ్యవస్థపై, మార్కెట్పై, నియంత్రణ వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. అందుకే ఈ సమస్యను సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వం కఠిన చట్టా లతో ముందుకు రావాలి. గ్రామస్థాయిలో పరీక్షా కేంద్రాలు, మొబైల్ టెస్టింగ్ యూనిట్లు, హాట్న్ నంబర్లు, ఫిర్యాదు, లపై తక్షణ స్పందన ఇవి అమలు కావాలి. పాలు సరఫరా గొలుసును డిజిటల్గా ట్రాక్ చేయడం, ఉత్పత్తి నుంచి వినియోగదారుని దాకా పారదర్శక వ్యవస్థ తీసుకురావడం అవసరం. రైతులకు న్యాయమైన ధరలు అందిస్తే మధ్య వర్తుల దందా తగ్గుతుంది. పాలు పోషకాహారం కావాలి. విషం కాదు. ప్రతి ఇంటి గ్లాసులో ఆరోగ్యం నిండాలి – రసాయనాలు కాదు. కల్తీ పాల మాఫియాపై సమాజం, ప్రభుత్వం, వినియోగదారులు కలిసికట్టుగా పోరాడాలి. లేదంటే మన నిరక్ష్యం ప్రతి గ్లాసును మృత్యు సందేశంగా మార్చే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండటం మాత్రమే కాదు – చైతన్యంగా స్పందించడం సమాజ ధర్మం.
-ఈ. శ్రీనివాస్ రావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Adulterated milk Breaking News Dairy Industry Food Safety Health risks latest news Milk Adulteration Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.