వెస్ట్ సెంట్రల్ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంపైకి వేటకు వెళ్లొద్దని సూచించింది.
ఉత్తరకోస్తాంధ్రకు ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని నుంచి ఛత్తీస్‌గఢ్, మరాఠ్వాడ, ఇంటీరియర్ కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నేటి వర్ష సూచన (జూన్ 13):
నేడు (జూన్ 13) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీ వర్ష సూచన (జూన్ 14):
శనివారం (జూన్ 14) అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణలో వాతావరణం:
ఈ రోజు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. శుక్రవారం (జూన్ 13) తెలంగాణలోని నల్లగొండలో గరిష్టంగా 37 డిగ్రీలు, మహబూబ్ నగర్లో కనిష్టంగా 27.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
గత 24 గంటల్లో అధిక వర్షపాతం:
గురువారం సాయంత్రం 7 గంటల సమయానికి తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో 64.5 మి.మీ., పల్నాడు జిల్లా మాచర్లలో 61.7 మి.మీ., కాకాణిలో 55 మి.మీ., చిత్తూరు జిల్లా రెడ్డిగుంటలో 54 మి.మీ., తిరుపతి జిల్లా భీములవారిపాలెంలో 47.5 మి.మీ. చొప్పున అధిక వర్షపాతం నమోదైంది.
Read also: Rain Alert: తెలంగాణకు నాలుగు రోజులు భారీ వర్ష సూచన