ఆగస్టు నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Andhra Pradesh Assembly Monsoon Sessions) జరగనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ ఏర్పాటుకి తర్వాత తొలి సమావేశాలు కావడం, కొత్త పాలన విధానాలకు సంబంధించిన చర్చలు మొదలుకానుండడం రాజకీయంగా కీలకంగా మారింది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా అసెంబ్లీకి దూరంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎమ్మెల్యేలు ఈసారైనా హాజరవుతారా? అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది.
ప్రతిపక్ష హోదా పై వైసీపీ డిమాండ్
వైసీపీ ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి మొహమాటపడుతున్నట్లు కనిపిస్తోంది. తమను అధికారిక ప్రతిపక్షంగా గుర్తించాలనే డిమాండ్‌తో పాటు, చర్చల సమయంలో తగిన సమయం ఇవ్వాలని కోరుతోంది. అయితే ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం మాత్రం, వైసీపీకి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పష్టంచేస్తోంది. 175 మంది సభ్యుల సభలో వైసీపీకి సరిపడా సంఖ్య లేకపోవడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు.
హాజరు కాబోతే వైసీపీకి మైలేజ్
అయితే ఈసారైనా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరైతే, తమ వాయిస్‌ను ప్రజలవద్దకు తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు వేయడం, ప్రజా సమస్యలపై చర్చ జరగడం ద్వారా పార్టీకి ప్రజల్లో మైలేజ్ పెరిగే అవకాశముంది. ఒకవేళ మళ్లీ బహిష్కరణను కొనసాగిస్తే, అది పార్టీకే నష్టంగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల వర్షాకాల సమావేశాల్లో వైసీపీ ఎలాంటి తీర్మానం తీసుకుంటుందో అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
Read Also : AP Cabinet : క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలివే