పోక్సో చట్టం అంటే ఏంటి?
POCSO Act India : పిల్లలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత కఠినమైన చట్టమే పోక్సో చట్టం. ప్రస్తుతం ఈ చట్టం దేశవ్యాప్తంగా మళ్లీ చర్చనీయాంశమవుతోంది. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన తర్వాత ఈ చట్టంపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. హైదరాబాద్‌లోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టంలోని పలు సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేశారు. దీంతో అసలు పోక్సో చట్టం అంటే ఏమిటి? ఇందులోని నిబంధనలు ఎలా ఉంటాయి? అనే అంశాలపై చర్చ మొదలైంది. POCSO అంటే “ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్”. అంటే పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించే చట్టం. పిల్లలపై పెరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2012లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.
అబ్బాయిలకు కూడా వర్తించే చట్టం
చాలామంది ఈ చట్టం కేవలం అమ్మాయిల రక్షణ కోసమే అనుకుంటారు. కానీ 18 ఏళ్లలోపు వయసున్న అబ్బాయిలకు, అమ్మాయిలకు ఇద్దరికీ ఈ చట్టం వర్తిస్తుంది. పిల్లలపై జరిగే లైంగిక దాడులు, అసభ్య ప్రవర్తన, అసభ్యకరమైన వీడియోలు చూపించడం, వేధింపులు వంటి చర్యలు అన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. సాధారణ నేరాల కేసులతో పోలిస్తే పోక్సో చట్టం కింద విచారణ విధానం చాలా కఠినంగా ఉంటుంది. ఈ చట్టం కింద కేసు నమోదైతే నిందితుడికి తక్షణ బెయిల్ దొరకడం చాలా కష్టం. సాధారణంగా నేరం జరిగిందని పోలీసులు కోర్టులో నిరూపించాలి. కానీ పోక్సో కేసుల్లో మాత్రం తాను నిర్దోషినని నిందితుడే కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది. బాధిత పిల్లలకు త్వరగా న్యాయం అందించేందుకు ప్రత్యేకంగా పోక్సో కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఈ కోర్టుల్లో కేసుల విచారణ వేగంగా జరుగుతుంది.
Read Also: TamilNadu Politics: ప్రకాశ్ రాజ్ ‘సెల్యూట్’ ఎవరికో తెలుసా?

పోక్సోలో శిక్షలు ఎలా ఉంటాయి?
పోక్సో చట్టంలో నేర తీవ్రతను బట్టి శిక్షలు మారుతూ ఉంటాయి. పిల్లలను అసభ్యంగా తాకడం లేదా లైంగిక ఉద్దేశంతో వేధిస్తే మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. తీవ్రమైన లైంగిక దాడుల కేసుల్లో ఏడు సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధించవచ్చు. 2019లో చేసిన సవరణల తర్వాత చిన్న పిల్లలపై అత్యంత దారుణమైన లైంగిక నేరాలకు మరణశిక్ష విధించే అవకాశం కూడా చట్టంలో కల్పించారు. అందుకే పోక్సోను దేశంలో అత్యంత కఠినమైన చట్టాల్లో ఒకటిగా భావిస్తారు.
ఈ చట్టం ప్రకారం బాధిత పిల్లల పేర్లు, ఫోటోలు, స్కూల్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టడం కూడా నేరమే. మీడియా లేదా సోషల్ మీడియాలో అలాంటి వివరాలు ప్రచారం చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. పిల్లల భద్రత, రక్షణ కోసం రూపొందించిన ఈ చట్టం రాజకీయాలకు అతీతంగా దేశంలో కీలక పాత్ర పోషిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: