తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేములవాడ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన చెన్నమనేని రమేష్ (Chennamaneni Ramesh) తన ఓటు హక్కును కోల్పోయారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఆధారంగా ఆయన భారత పౌరుడు కాదని తేలింది. దీంతో ఎన్నికల అధికారులు అతని పేరును వేములవాడ ఓటరు జాబితా (Voter list) నుంచి తొలగించారు.ఈ అంశంపై అధికారులు మరింత స్పష్టత ఇచ్చారు. చెన్నమనేని నివాసానికి నోటీసులు అంటించారు. అందులో ఆయన పౌరసత్వం చెల్లదని, ఓటరుగా కొనసాగడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ నోటీసుకు ఇంకా చెన్నమనేని నుంచి స్పందన రాలేదు. అయితే ఇది మొదటిసారి కాదు. గతంలోనూ అధికారులు ఇదే విషయంపై నోటీసులు జారీ చేశారు. సమాధానం ఇవ్వకపోవడంతోనే తాజా చర్యల్ని చేపట్టారు.
ఆది శ్రీనివాస్ న్యాయపోరాటం ఫలితమే
ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అయిన ఆది శ్రీనివాస్ ఈ వివాదంపై గతంలోనే కోర్టును ఆశ్రయించారు. ఆయన సాగించిన న్యాయపోరాటమే ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆ తీర్పును అమలు చేయాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనికనుగుణంగానే చెన్నమనేని పేరును ఓటరు జాబితా నుంచి తొలగించారు.
దేశ రాజకీయాల్లో అరుదైన ఘటన
ఒక వ్యక్తి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం సాధారణమే. కానీ, పౌరసత్వ వివాదం వల్ల ఓటు హక్కును కోల్పోవడం మాత్రం అరుదైన పరిణామం. ఇది దేశ రాజకీయాల్లోనే తొలిసారిగా జరగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా చట్టసభలో నాలుగు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన నేత ఓటరు కాదు అనడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ముందెన్నడూ లేని ఘటనగా వేములవాడ చరిత్రలో చేరింది
ఈ పరిణామం వేములవాడ ప్రజలు, రాజకీయ నేతలు, కార్యకర్తల్లో కలకలం రేపింది. పౌరసత్వ వివాదాల కారణంగా ఓటు హక్కును కోల్పోయిన చెన్నమనేని రమేష్ పేరుతో వేములవాడ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇది తెలుగురాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also : Narasimha Murthy Raju: ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య