హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సర్వీస్ నిబంధనల కోసం ఎదురు చూస్తున్నామని.. కనీసం ఈ 2026 సంవత్సరంలో అయినా ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలు రూపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టిఎస్ యుటిఎఫ్(TS UTF) ప్రభుత్వానికి విజప్తి చేసింది. రాష్ట్రంలో పర్యవేక్షణ అధికారుల ఖాళీలను భర్తీ చేసి పాఠశాల విద్యాశాఖలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Read also: KCR : కేసీఆర్ పై టీడీపీ నేతల ఫైర్
పర్యవేక్షణ అధికారుల ఖాళీలను భర్తీ చేయాలి
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (Telangana State United Teachers Federation) రాష్ట్ర కార్యాలయంలో గురువారం 2026 సంవత్సర డైరీ, క్యాలెండర్, అధ్యాపక దర్శిని జిఒల సంపుటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెగ్యులర్ జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారులు లేక కీలకమైన పర్యవేక్షణ కొరవడిందన్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఒక కారణమని, నూతన రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 కి అనుగుణంగా సమగ్రమైన సర్వీసు నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలని కోరారు.
ప్రభుత్వానికి టిఎస్ యుటిఎఫ్ విజప్తి
తెలంగాణ విద్యావిధానంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలని కోరారు. రాష్ట్రాల హక్కులను హరించి పేదలకు విద్యను దూరం చేసే జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా తిరస్కరించాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఉపాధ్యాయుల(Senior teachers)కు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణత నుండి మినహాయింపు ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నాలుగు నెలలైనా కేంద్ర ప్రభుత్వం గానీ, ఎన్సీటిఈ గానీ రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయలేదని, పార్లమెంటులో సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించిన సమయంలోనూ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే అవసరమైన న్యాయ, చట్టపరమైన చర్యలు చేపట్టి సీనియర్ ఉపాధ్యాయుల ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు పెంపు ఆలోచన విరమించుకోవాలని, రిటైరైన ఉపాధ్యాయులు, ఉద్యోగుల బకాయిలను తక్షణమే చెల్లించాలని, అవసరమైతే పదివేల కోట్లు అప్పు తెచ్చి ఒకేసారి బకాయిలన్నీ క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. 2026 సంవత్సరం పోరాటాల సంవత్సరంగా ఉండనుందన్నారు. టిఎస్ యుటిఎఫ్ కార్యకర్తలు పనిచేసే పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని ఇటీవల జనగామలో జరిగిన రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించుకున్నామని చెప్పారు. జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రక టించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
సంఘం ఆధ్వర్యంలో కూడా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కోశాధి కారి టి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు సింహా చలం, వెంకటప్ప, విశాలి, ఎస్వీ కొండల రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజారావు, శ్యామ్ సుందర్, జగన్నాథశర్మ, జిల్లాల నాయకులు భగవంతాజ్, భువనేశ్వరి, కవిత, భాషా, మాజీద్, సీనియర్ నాయకులు మస్తాన్రావు, అశోక్, వెంకటేశ్వర్లు, అరుణ మ్మ, రామకృష్ణ, రమేష్ పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: