హైదరాబాద్ : సొంత ఇల్లు (Own house) అనేది ప్రతీ ఒక్కరి కల. దీనిని నెరవేర్చుకోవడానికి చాలా మంది తమ సంపాదనలో సేవింగ్స్ చేసుకొని ప్లాట్ లేదా ఇండిపెండెంట్ హౌస్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రభుత్వం కొన్ని ప్లాట్లను తక్కువ ధరలకు వేలం వేసి విక్రయిస్తున్నారు. దీనిలో భాగంగా మేడ్చల్ మల్కాజ్గరి జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్లకు వేలం వేయగా దాదాపు రూ.100 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజ్గరి జిల్లాలోని బహదూర్పల్లిలో ఉన్న రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ విషయాన్ని రాజీవ్ స్వగృహ (Rajiv Swagruha) మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం వెల్లడించారు. మంగళవారం జరిగిన బహిరంగ వేలంపాటలో మొత్తం 68 ప్లాట్లకు గాను.. తొలి రోజు 50 ప్లాట్లకు వేలం నిర్వహించారు. రాత్రి 8 గంటల వరకు జరిగిన ఈ వేలంపాటలో గరిష్టంగా చదరపు గజం ధర రూ. 46,500 పలికినట్లు గౌతం తెలిపారు. వేలం నిర్వహించిన 50 ప్లాట్ల విక్రయం ద్వారా సుమారు రూ. 100 కోట్ల మేర ఆదాయం వచ్చిందని మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు.
సుమారు 119 మంది ఈ ప్లాట్లను కొనుగోలు చేయడానికి పోటీ పడ్డారు. సగటున ప్రతీ ఒక్క ప్లాట్కు 30 మందికి పైగా పోటీ పడ్డారంటే.. వీటికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా.. ఈ ప్లాట్లు ఔటర్ రింగ్ రోడ్డుకు(ఓఆర్ఆర్) అతి సమీపంలో ఉండటం కూడా ఈ భారీ డిమాండ్కు ఒక కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నిపుణులు చెబుతున్నారు. వేలంలో విక్రయించబడని ఈ ప్లాట్లు 200 నుంచి 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిలో కార్నర్ ప్లాట్కు రూ. 30,000.. మిడిల్, ఇతర ఫ్లాట్లకు రూ.27,000 కనీస ధరగా నిర్ణయించారు. ఈ వేలంలో కార్నర్ ప్లాట్లకు అత్యధిక ధర పలకడం విశేషం.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :