టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) సేవలను ప్రజల వరకు మరింతగా చేరువ చేయాలనీ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ , విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్లకు పిలుపునిచ్చారు. సజ్జనార్ (MD VC Sajjanar) ఈ కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా పరిగణిస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్టీసీ సేవల ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. ముఖ్యంగా, “యాత్రాదానం” అనే కార్యక్రమం ద్వారా సాధారణ ప్రజలకు ఆర్టీసీ సేవల (RTC Services) ప్రయోజనాలను చేరవేయడం కీలకం అని ఆయన అభిప్రాయపడ్డారు.
శనివారం బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్ల సమావేశంలో సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రతీ డిపోకు ముగ్గురు బస్ ఆఫీసర్లు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలో సజ్జనార్ మాట్లాడుతూ, ఆర్టీసీ సేవలను ప్రజలలో మరింత ప్రాచుర్యం పొందేలా చేయడం, కొత్త వ్యూహాలను అమలు చేయడం అవసరమని గుర్తించారు.
శుభకార్యాల సమయంలో బస్సుల బుకింగ్
సజ్జనార్ ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో బస్సుల బుకింగ్, కార్గో సేవలను ప్రోత్సహించమని బస్ ఆఫీసర్లకు సూచించారు. ఇవి ఒక విధంగా ఆర్టీసీ (RTC) సేవలను ఆదాయవంతమైన రంగాలుగా మార్చడమే కాకుండా, సామాజిక ప్రయోజనాలను కూడా చేరవేస్తాయని ఆయన వివరించారు. “ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం ఆర్టీసీ సేవలను ఉపయోగించడం ద్వారా సౌకర్యం పొందుతారు. అలాగే, మన సంస్థ సామాజిక బాధ్యతను నిర్వహించడంలో ముందుంటుంది” అని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగుల నిబద్ధత, అంకితభావం వల్లే
ఈ సమావేశంలో చర్చించిన అంశాల్లో ముఖ్యంగా ప్రజలకు చేరువైన సేవల సమన్వయం,యాత్రాదానం కార్యక్రమానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 21 వేలకు పైగా అద్దె బస్సులు బుక్ చేసినందుకు విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్ల పనితీరును సజ్జనార్ ప్రశంసించారు. రాబోయే బతుకమ్మ, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.టీజీఎస్‌ఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీ (Tour package) లకు మంచి స్పందన లభిస్తోందని.. త్వరలోనే అయోధ్య, వారణాసి వంటి పుణ్యక్షేత్రాల టూర్ ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలిపారు.
ఉద్యోగుల నిబద్ధత, అంకితభావం వల్లే సంస్థ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి గడపకు ఆర్టీసీ సేవలను తీసుకెళ్లడమే విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్‌ల ప్రధాన లక్ష్యం. వీరు తమ పరిధిలోని గ్రామాల్లో, కాలనీల్లో ప్రజలతో నిరంతరం సంప్రదిస్తూ ఉంటారని.. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్లు వంటి సమాచారాన్ని సేకరించి, వాటిని ఉన్నతాధికారులకు చేరవేస్తారన్నారు. అలాగే, శుభకార్యాలు, జాతరల వంటి వాటికి అద్దె బస్సులను బుక్ చేసుకోవాలని ప్రజలకు వివరిస్తారన్నారు. క్షేత్రస్థాయి సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకొచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని సజ్జనార్ వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: