తెలంగాణ (TG) పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) జరుగుతుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలోని క్షేత్రస్థాయి నాయకుల్లో పండగ వాతావరణం నెలకొన్నప్పటికి, ఓవైపు ప్రభుత్వవ్యతిరేకత, మరోవైపు ఇటీవల నియామకమైన డిసిసి (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల పట్ల అక్కడక్కడ వెల్లువెత్తుతున్న అసంతృప్తి అధికార కాంగ్రెస్ పార్టీ గ్రామీణ నాయకులు ఎక్కడ తమపై ప్రతికూల ప్రభావం చూపుతుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అధిష్టానం క్షేత్రస్థాయి పరిస్థితితులకు భిన్నంగా డిసిసిలను ఎంపిక చేశారని, పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా, ప్రతికూల పరిస్థితిలో కూడా పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న తమకు సామాజిక న్యాయం పేరుతో అవకాశం దూరం చేశారని పలు విధాలుగా అసంతృప్తి గళం వినిపిస్తున్న వేళ మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు నూతన డిసిసి అధ్యక్షులు, పూర్వ డిసిసి అధ్యక్షులు, టిపిసిసి కార్యవర్గ సమావేశం గాంధీ భవన్ లో జరుగబోతున్నది.
Read Also: Telangana: కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు.. రేవంత్ రెడ్డి
ఓ వైపు క్షేత్రస్థాయిలో మూడు విడుతల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. డిసెంబరు 3న చివరి దశ నామినేషన్ ఘట్టం మొదలు కాబోతున్నది. మొదటి, రెండు విడుతల సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, (Revanth Reddy) ఎఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఎఐసిసి కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్ పాల్గొంటుండటంతో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు బిజెపి, బిఆర్ఎస్ పార్టీల కంటే అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రతిష్టాత్మక ఎన్నికలు: కాంగ్రెస్ బలం పరీక్ష
అసెంబ్లీలో గత రెండు సంవత్సరాలుగా జరిగిన ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను వరుసగా గెలిపించుకొని ఆధిక్యతను నిరూపించుకొంటుంది. దీనికి ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు నిదర్శనం. బిఆర్ఎస్ గడిచిన పదేళ్లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలహీన పరిచింది. బిఆర్ఎస్ అప్రతిహాతంగా గత పదేళ్ళు ఎన్నికలలో గెలుస్తు రావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన బలమైన నాయకులు కూడా మానసికంగా ధైర్యం కోల్పోయి పోటీ చేయడానికి వెనుకడుగు వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఉచిత బస్సు ప్రయాణం మినహా ఇతర హామీలు ఏవి కూడా అమలు చేయకపోవడంతో కొంత ప్రతికూల పరిస్థితి నెలకొంది.
గ్రామపంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల ప్రాతిపదికన జరగకపోయినప్పటికి అధికార కాంగ్రెస్ నాయకులకు ప్రజలలో ఆదరణ లభిస్తుందా, లేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నది. జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ ఎన్నికలు పరిమితమైన ప్రజాక్షేత్రంలో ప్రత్యేక పరిస్థితిలో జరిగాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసిన విశాల గ్రామీణ ప్రజారాశుల మద్దతు అలాగే నిలుపుకుందా లేక తగ్గిందా, పెరిగిందా అనే అంశం కూడా తేటతెల్లం అవబోతుంది. కాంగ్రెస్ పార్టీ చిహ్నం బ్యాలెట్ పేపర్పై ఉండనప్పటికి పార్టీ బలపరిచే అభ్యర్థులను మెజార్టీ స్థానాల్లో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయి నాయకులకు అండగా నిలబడిన గ్రామీణ నాయకులను గెలిపించుకొని పార్టీని మరింత సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో తన ఆధిక్యతను ప్రదర్శించి సొంతపార్టీ నేతలపై, ప్రతిపక్షాలపై ఆధిపత్యం చాటుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఈ ఎన్నికలను ఎవరూ తేలికగా తీసుకోవద్దని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి ఉద్భోధిస్తున్నారు.
డిసిసి నియామక వివాదాలు: కొన్ని ఉదాహరణలు
స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఆఘమేఘాలపై సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగితా జిల్లాల డిసిసి అధ్యక్షులను ప్రకటించగా అవి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆ ప్రకటన కొన్ని జిల్లాలో తుఫాను సృష్టించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించనప్పటికి సంస్థాగత నిర్మాణంలో అధికార పార్టీ బిసిలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ డిసిసిలను ప్రకటించింది. ఎఐసిసి నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను పరిశీలకులుగా వచ్చి వారి సమక్షంలోనే బహిరంగ సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపట్టారు. నేతల పనితీరు, కూర్పులో సామాజిక సమీకరణాల కోణాలను మేళవించి ఈ నియామకాలు చేపట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల ఈ నియామకాలు స్థానిక నేతల్లో అగ్గి రాజేస్తోంది.
జిల్లాలు వారీగా అసంతృప్తి గళాలు
- నల్లగొండ: రోడ్లు భవనాలు శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా నియామకమైన కైలాశ్ నేతను వెంటనే తొలగించాలని ముఖ్యమంత్రికి లేఖ రాయడంతో పార్టీలో తెలంగాణ వ్యాప్తంగా ఇన్నాళ్ళు డిసిసిల నియామకంపై పలు జిల్లాలో ఉన్న అసంతృప్తి బాహాటంగా పెద్దగొంతుతో మాట్లాడటానికి ప్రేరణ ఇచ్చింది.
- మహబూబ్‌నగర్: ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ధీమాతో ఉన్నప్పటికీ ఆయనకు బదులు అక్కడ సంజీవ్ ముదిరాజ్‌ను నియమించడంతో వివాదం మొదలైంది.
- వనపర్తి: డిసిసిగా శివసేనారెడ్డి ఎంపిక చేయడంతో ఎమ్మెల్యే మేగారెడ్డి, చిన్నారెడ్డిలు అసంతృప్తిలో ఉన్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకొంటున్నాయి.
- భూపాలపల్లి, ములుగు: ఈ జిల్లాల్లో మాత్రం మంత్రుల అనుచరులకు పదవులు లభించాయి. మహబూబాబాద్ ఎమ్మెల్యే భార్యకు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
- వరంగల్: మైనార్టీ నేత ఆయూబ్‌ను నియమించడం వెనుక కూడా పెద్ద రాజకీయ వ్యూహప్రతివ్యూహాలు జరిగినా అక్కడ కూడా అసంతృప్తి శ్రేణుల్లో నెలకొంది.
- నిజామాబాద్: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాటిపల్లి నగేశ్‌రెడ్డి ఎంపికపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు.
- కామారెడ్డి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రయత్నించినా, గత అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావును కొనసాగించడం సాధ్యం కాలేదు. ఏలె మల్లికార్జున్ నియమించడానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చి సఫలీకృతులైనారు.
- ఆదిలాబాద్ (ఉమ్మడి): మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమాసాగరరావు అనుచరవర్గంకు కాకుండా మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్యే వినోద్ సన్నిహితుడిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
- కుమురంభీం ఆసిఫాబాద్: డిసిసి అధ్యక్షుడిగా ఉన్న విశ్వప్రసాదరావును, సీనియర్లను పక్కనబెట్టి 2024లో పార్టీలోకి కొత్తగా చేరిన ఆత్రం సుగణకు అవకాశం ఇవ్వడంపై కూడా పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు.
- సంగారెడ్డి, రంగారెడ్డి: ఇక్కడ స్థానిక పరిస్థితుల దృష్ట్యా, పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినప్పటికీ, ఎఐసిసి ఈ రెండు జిల్లాల పార్టీ సారథులను నియమించడంలో ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తోంది.
ఎఐసిసి తెలంగాణ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ స్థానిక సంస్థలు, డిసిసి అధ్యక్షుల నియామకం వల్ల పార్టీలో తలెత్తిన వివాదం ఏ విధంగా పరిష్కరించి అందరిని సంతృప్తి చెందేలా ఎలా చేస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: