తెలంగాణ పోలీస్ డ్రైవర్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో కీలక మలుపు చోటుచేసుకుంది. పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్, ఫైర్ సర్వీస్ విభాగాల్లో 325 డ్రైవర్ పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసి రెన్యువల్ చేయించుకోవడంలో విరామం ఉన్న అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, మూడు నెలల్లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.
Read also: RBI Governor meeting : సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…
TG
325 డ్రైవర్ పోస్టుల భర్తీకి మార్గం
ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 2022లో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కీలక నిబంధనను పొందుపరిచింది. దరఖాస్తు నాటికి కనీసం రెండేళ్ల పాటు నిరంతరంగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని స్పష్టం చేసింది. అయితే లైసెన్స్ గడువు ముగిసి, తరువాత రెన్యువల్ చేయించుకున్న అభ్యర్థులను బోర్డు అనర్హులుగా ప్రకటించింది. దీనిని సవాలు చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, మోటారు వాహన సవరణ చట్టం–2019 ప్రకారం ఏడాది లోపు రెన్యువల్‌కు అవకాశం ఉన్నందున వారికి అర్హత ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బోర్డు తరపు వాదనలను సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం, లైసెన్స్ గడువు ముగిసిన తరువాత ఉన్న విరామ కాలాన్ని ‘నిరంతర లైసెన్స్’గా పరిగణించలేమని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు తీర్పు రద్దయింది. ఈ నిర్ణయంతో దాదాపు రెండేళ్లుగా న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న 325 డ్రైవర్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన మూడు నెలల గడువులోగా నియామకాలు పూర్తవుతాయని అభ్యర్థులు ఆశిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: