తెలంగాణ (Telangana) రాష్ట్రానికి చెందిన ఉన్నత విద్యా మండలి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (CPGET-2025) నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. జూన్ 13న ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వుడిత్యాల బాలకిష్టారెడ్డి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ మరియు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్ ప్రకారం సీపీగెట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 18వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఆగస్టు మొదటి వారంలో ప్రవేశ పరీక్షలు ఉంటాయి. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 297 కాలేజీల్లో పీజీ కోర్సులు, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్షలో భాగంగా ప్రవేశాలు కల్పించే విశ్వవిద్యాలయాలు:
ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్టీయూహెచ్, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీల్లోని సీట్లను సైతం భర్తీ చేస్తారు.మొత్తం మూడు విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నారు.
ఏపీ కోటాలో మార్పులు:
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు నిండటంతో ఏపీ కోటా సీట్లకు ఈ ఏడాది నుంచి కోతపెట్టనున్నారు. గతంలో 15 శాతం సీట్లను ఏపీ విద్యార్ధులకు కేటాయించేవారు. ఇక నుంచి ఏపీ విద్యార్థులు నాన్‌లోకల్ కోటాలో మాత్రమే పోటీపడాల్సి ఉంటుంది. ఈ సారి నుంచి దివ్యాంగ విద్యార్ధులకు 5 శాతం రిజర్వేషన్ సైతం అమలు చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభతేదీ: జూన్ 18, 2025.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: జూలై 17, 2025.
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు తుది గడువు: జూలై 24, 2025.
రూ.2 వేలు ఆలస్యం రుసుముతో దరఖాస్తుకు తుది గడువు: జూలై 28, 2025.
ప్రవేశ పరీక్షలు: ఆగస్టు మొదటి వారంలో
Read also: Revanth Reddy: ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం