తెలంగాణ శాసనసభ(TG Assembly), శాసనమండలి శీతాకాల సమావేశాలు ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశారు. అదే రోజు ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ అంశంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య కొనసాగుతున్న తీవ్ర రాజకీయ వివాదాల నేపథ్యంలో ఈ సమావేశాలకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది.
Read also: Kalvakuntla Kavitha: BRSలోకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదు
డిసెంబర్ 30 నుంచి నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మూడు రోజుల విరామం అనంతరం, జనవరి 2న శాసనసభ తిరిగి ప్రారంభం కానుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల సందర్భంగా కీలక అంశాలపై విస్తృత చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
నదీ జలాలపై కాంగ్రెస్–బీఆర్‌ఎస్ మధ్య వాగ్వాదం
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రానికి దక్కాల్సిన కృష్ణా, గోదావరి నదీ జలాల వాటాను సమర్థంగా సాధించలేకపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని సభలో ప్రస్తావించి ప్రత్యేక చర్చ జరిపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు రాజీ పడిందని సీఎం ఇటీవలే విమర్శించారు.
కృష్ణా నదిపై ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా పూర్తికాకపోవడం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఎదురైన నిర్మాణ, ఆర్థిక సమస్యలపై బీఆర్‌ఎస్ నిర్లక్ష్యాన్ని వివరిస్తూ జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక నోట్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్టు సమాచారం. కొడంగల్‌లో జరిగిన నూతన సర్పంచుల సమావేశంలో పాలమూరు ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పదేళ్లపాటు పట్టించుకోలేదని సీఎం విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంతో మరింత రాజకీయ రగడ
ఈ సమావేశాల్లో(TG Assembly) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ పాలనలో తన భర్త ఫోన్ ట్యాపింగ్‌కు గురయ్యిందని కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను సీఎం ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ నేతలు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: