Telangana రాష్ట్రం నుంచి తొలిసారిగా ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి కావడం గర్వకారణంగా మారింది. ఈ సందర్బంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో “బియ్యం ఎగుమతి విధానం”పై మంగళవారం ఒకరోజు సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఏడాది వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానాన్ని పొందిందని తెలిపారు. సుమారు 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరగడం ఒక రికార్డు అని చెప్పారు. ఈ విజయానికి కారణం రైతుల కృషి, అనుకూల వాతావరణం, ప్రగతిశీల సాగు విధానాలేనని అభిప్రాయపడ్డారు.
ప్రతి ఏడాది దాదాపు 10 లక్షల మెట్రిక్
రాష్ట్ర ప్రజల అవసరాల కోసం, అలాగే కేంద్ర నిల్వల కొరకు వినియోగించని మిగులు బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్ ప్రభుత్వంతో తెలంగాణ నేరుగా ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల ప్రతి ఏడాది దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేసే అవకాశం ఉన్నదని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో విస్తృతంగా సాగుచేసే ఎం.టి.యూ 1010, ఐ.ఆర్ 64 రకాల బియ్యానికి ఫిలిప్పీన్స్ మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉందని చెప్పారు.
రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టంచేశారు. బియ్యం కొనుగోలుకు సంబంధించి ప్రతి గింజను ప్రభుత్వమే సేకరిస్తుందని, క్వింటాలుకు రూ.500 బోనస్‌ను సన్న రకాల వరికి అందజేస్తున్నామని తెలిపారు. ఆధునిక సాగు విధానాల్లో డైరెక్ట్ సీడింగ్, తక్కువ నీటితో సాగు చేయగల AWD పద్ధతులు, తక్కువ రసాయనాల వాడకం వంటి పద్ధతులకు రైతులను ప్రోత్సహించాలన్నారు. అలాగే బియ్యం ఎగుమతిని మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు నూతన విధానాలు రూపొందిస్తామని చెప్పారు.ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య మాట్లాడుతూ, ఫిలిప్పీన్స్ ఎప్పటికీ దిగుమతులపై ఆధారపడే దేశం కాబట్టి తెలంగాణ బియ్యానికి అక్కడ మంచి అవకాశాలున్నాయని చెప్పారు. సరైన విధానాలతో నడిపితే రాష్ట్రానికి మంచి ఆదాయం, రైతులకు శాశ్వత మార్కెట్ లభిస్తుందన్నారు. ఈ సదస్సులో అపెడా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, రైతు నేతలు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Read more :
saraswati pushkaralu : తెలంగాణలో పుష్కరాలు.. వెబ్ సైట్ లాంచ్ చేసిన మంత్రులు