Telangana: సంక్రాంతి పండుగ వస్తుందంటే భాగ్యనగరం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. లక్షలాది మంది స్వగ్రామాల బాట పట్టడంతో రహదారులన్నీ రద్దీగా మారుతాయి. ప్రతి ఏడాది ఈ పండుగ ప్రయాణాల్లో ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ట్రాఫిక్ జామ్‌లు, టోల్ ప్లాజా(Toll Plaza)ల వద్ద గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను కలిపే కీలక మార్గమైన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఈ రద్దీ అత్యధికంగా ఉంటుంది.
Read also: Seed Act: పటిష్టమైన విత్తన చట్టమే పరిష్కారం
సంక్రాంతి ప్రయాణికులకు గుడ్‌న్యూస్
అయితే ఈసారి సంక్రాంతి ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్–విజయవాడ హైవేపై టోల్ ఫీజును తాత్కాలికంగా మినహాయించాలని తెలంగాణ(Telangana) ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేక లేఖ రాశారు. జనవరి 9 నుంచి 18 వరకు టోల్ మినహాయింపు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పండుగ సమయంలో ఈ హైవేపై వాహన రాకపోకలు సాధారణ రోజులతో పోలిస్తే దాదాపు 200 శాతం పెరుగుతాయని, దీనివల్ల పంతంగి, కొర్లపహాడ్ వంటి టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని మంత్రి లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే తెలంగాణ ప్రజలకు భారీ లాభం చేకూరనుంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేవారే కాకుండా, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం వంటి జిల్లాలకు వెళ్లే వేలాది మంది తెలంగాణవాసులు కూడా ఈ హైవేనే వినియోగిస్తుంటారు. రాష్ట్రం దాటకపోయినా టోల్ ఫీజు చెల్లించాల్సి రావడం వారికి ఆర్థిక భారంగా మారుతోంది. ఒకవేళ టోల్ మినహాయింపు లభిస్తే ఒక్క కారు ప్రయాణంలో అటు–ఇటు కలిపి సుమారు రూ.700 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.
25 వేల నుంచి 30 వేల వాహనాలు
సాధారణ రోజుల్లో పంతంగి టోల్ ప్లాజా మీదుగా రోజుకు 25 వేల నుంచి 30 వేల వాహనాలు వెళ్లగా, సంక్రాంతి సమయంలో ఈ సంఖ్య లక్షకు చేరుతుందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. బస్సు టికెట్ల ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో, సొంత వాహనాల్లో ప్రయాణించే మధ్యతరగతి కుటుంబాలకు ఈ టోల్ మినహాయింపు నిజంగా పెద్ద ఉపశమనం అవుతుందని భావిస్తున్నారు. మంత్రి చేసిన విన్నపంపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే, ఈ సంక్రాంతి ప్రయాణాలు మరింత సాఫీగా సాగడమే కాకుండా ప్రయాణికుల జేబుపై భారం కూడా తగ్గనుంది. దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: