Journalists Accreditation Cards Telangana: వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించింది. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన జర్నలిస్టులు, ప్రభుత్వ గుర్తింపు కార్డుల విషయంలో జరుగుతున్న జాప్యం మరియు కోతలపై నిరసన వ్యక్తం చేశారు.
Read Also: Wildlife : వన్యప్రాణులను కాపాడుకోలేమా?
జీవో 252తో అన్యాయం..
ఈ సందర్భంగా TWJF రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అక్రిడిటేషన్ కార్డులను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఉన్నవాటిలో కోతలు విధించడం అన్యాయమని మండిపడ్డారు. కొత్తగా తీసుకొచ్చిన జీవో 252 వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు మరియు డెస్క్ జర్నలిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ జర్నలిస్టుల ఏరివేత పేరుతో అసలైన జర్నలిస్టులకు గుర్తింపు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రిడిటేషన్ కమిటీ నియామకాన్ని నిలిపివేయాలి
జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేరిబాయి గణేష్, మైల సైదులు మాట్లాడుతూ.. జీవో 252ను సవరించిన తర్వాతే జిల్లా అక్రిడిటేషన్ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. అనంతరం జిల్లా రెవిన్యూ అధికారి (DRO) సంగీత, డీపీఆర్వో (DPRO) బాలేశ్వరికి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పాల్గొన్న నేతలు
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సురేష్, కాజా పాషా, అజయ్ కుమార్, రాజేందర్, కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేష్, సుదర్శన్, మణి, నర్సింహారెడ్డి మరియు వివిధ నియోజకవర్గాల అధ్యక్ష కార్యదర్శులు జగన్, రాఘవేందర్ గౌడ్, శంకర్, భగవంతు తదితర జర్నలిస్ట్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: