Rain : తెలంగాణలో గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కాలువలు, చెరువులు నీటితో నిండిపోయాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడడంతో, మరో మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
శనివారం ఉదయం వర్షాల (Rain) ప్రభావంపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు ఎక్కువగా కురిసే ప్రాంతాల్లో (NDRF-National Disaster Response Force), (SDRF-State Disaster Response Force) బృందాలను ముందుగానే మొహరించాలని ఆదేశించారు. ఆయా బృందాలు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే సహాయక శిబిరాలకు తరలించాలని సూచించారు.
భారీ వర్షం ముప్పులో ఉన్న జిల్లాలు
నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
నీటిపారుదల శాఖకు ఆదేశాలు
అధిక వర్షాల కారణంగా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలను నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఎం ఆదేశించారు. నీటిమట్టాన్ని అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంటే ముందుగానే కలెక్టర్లు, సిబ్బంది, ప్రజలకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
అంటువ్యాధుల నియంత్రణ
వర్షపు నీరు నిల్వ ఉంటే దోమలు, క్రిమికీటకాలు విస్తరించి అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని సీఎం హెచ్చరించారు. నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరంగా శుభ్రతా పనులు చేయాలని సూచించారు. వైద్యారోగ్యశాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచి, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం, పశు నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.
హైదరాబాద్‌లో ప్రత్యేక జాగ్రత్తలు
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, హైడ్రా, (SDRF-State Disaster Response Force), అగ్నిమాపక శాఖలు ప్రజల వినతులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. పోలీసుల సూచన మేరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చాయి. పండుగలు కూడా కలిసివచ్చినందున పాఠశాలలకు ఆదివారం వరకు సెలవులు ప్రకటించారు.
Read also :