Double bedroom housing : తెలంగాణలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలను వెలికితీయడానికి Government of Telangana వినూత్న విధానాన్ని అమలు చేస్తోంది. ఇళ్లలో నిజంగా లబ్ధిదారులు నివసిస్తున్నారా లేదా అన్నది తెలుసుకోవడానికి, గత నాలుగు నెలల విద్యుత్ బిల్లులను ఆధారంగా తీసుకొని సర్వే నిర్వహిస్తోంది. నెలకు 50 యూనిట్లకు తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న ఇళ్లలో ఎవరూ నివసించడం లేదని అధికారులు గుర్తించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించిన ఈ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైలట్ ప్రాజెక్టుగా రాంపల్లి ప్రాంతంలోని 2,200 డబుల్ బెడ్‌రూం ఇళ్లను తనిఖీ చేయగా, మెజారిటీ ఇళ్లలో కనీస అవసరమైన విద్యుత్ వినియోగం కూడా లేకపోవడం బయటపడింది. సాధారణంగా ఒక కుటుంబం నివసిస్తే నెలకు కనీసం 150 నుంచి 200 యూనిట్లు ఖర్చవుతాయని అధికారులు తెలిపారు. అంతకంటే తక్కువ వినియోగం ఉండటంతో, ఆ ఇళ్లలో లబ్ధిదారులు నివసించడం లేదని నిర్ధారించారు.
Read Also: India vs New Zealand : ODI టాస్ భారత్‌దే, సిరీస్ ఎవరిది?
తనిఖీలు జరుగుతున్నాయన్న సమాచారం ముందే తెలిసి, కొందరు లబ్ధిదారులు తనిఖీ సమయంలో తాత్కాలికంగా ఇళ్లలో ఉండే ప్రయత్నం (Double bedroom housing) చేయడంతో, అధికారులు కరెంట్ బిల్లుల తనిఖీ అనే కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ విధానం ద్వారా నిబంధనల ఉల్లంఘనలు స్పష్టంగా బయటపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలుగు చక్రాల వాహనం (కారు లేదా ట్రాక్టర్) ఉన్నవారు గృహ నిర్మాణ పథకాలకు అనర్హులు. అయితే మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన తనిఖీల్లో 165 మంది లబ్ధిదారులకు సొంతంగా కార్లు, ట్రాక్టర్లు ఉన్నట్లు గుర్తించారు. వీరి వివరాలు నమోదు చేయడంతో హౌసింగ్ బోర్డు కార్యాలయం వద్ద కొందరు లబ్ధిదారులు ఆందోళనకు దిగడం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 59,400 డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాల్సి ఉండగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 22,000 ఇళ్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రేటర్ తరహాలోనే త్వరలో జిల్లాల్లో కూడా ప్రత్యేక యాప్ ద్వారా సర్వే నిర్వహించేందుకు హౌసింగ్ శాఖ సిద్ధమవుతోంది. అనర్హుల నుంచి ఇళ్లను స్వాధీనం చేసుకుని, ‘ప్రజా పాలన’ దరఖాస్తుల ద్వారా నిజమైన పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఈ డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీని కూడా పూర్తిచేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: