హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం జనవరి 4వ తేదీన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి రూ.12,000 సాయం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన చర్చించే అవకాశం ఉంది. అలాగే, మరిన్ని అంశాలపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు.
కొన్ని వారాల క్రితం సమావేశమైన తెలంగాణ క్యాబినెట్.. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు, ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతించేలా చట్టానికి సవరణలు వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. అలాగే, రైతు భరోసా విధి విధానాలు, యాదాద్రితో పాటు భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై కూడా చర్చించింది. కాగా, ఈ నెల 30న కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి సంతాప దినాల్లో భాగంగా నివాళులర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దీంతో కేబినెట్ భేటీ వాయిదా పడింది.