తెలంగాణ రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఏం చేశావని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్న ముఖ్యమంత్రి కుర్చీకి తానే పునాది వేశానని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి తాను పోరాడానని, కానీ ఇప్పుడు అదే పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం అన్యాయమని అన్నారు.
రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్‌పై వ్యతిరేకత
తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఏడాది గడవకముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, దీనికి ముఖ్యమైన కారణం సీఎం రేవంత్ రెడ్డినే అని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలు దీని పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, పార్టీలోని నేతలను నిర్దాక్షిణ్యంగా తొలగించడం తగదని విమర్శించారు.

సస్పెన్షన్ లెటర్ను ఫ్రేమ్ కట్టించుకున్న మల్లన్న
తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జారీ చేసిన లెటర్ను ఫ్రేమ్ కట్టించుకున్నట్లు తీన్మార్ మల్లన్న తెలిపారు. ఈ సస్పెన్షన్ తన రాజకీయ ప్రయాణంలో మరో మైలురాయిగా నిలుస్తుందని, ఇది తన కోసం తానే పోరాడాల్సిన సమయమని అన్నారు. పార్టీలో వర్గపోట్లు, అసమ్మతి వాదనల వల్ల బలమైన నాయకత్వాన్ని పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
బీసీలకు రాజ్యాధికారం ఎలా వస్తుందో చూపిస్తాం
తీన్మార్ మల్లన్న తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలకు రాజ్యాధికారం ఎలా వస్తుందో త్వరలోనే చూపిస్తామని, తాను కొత్త దిశగా ప్రయాణించబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో బీసీ వర్గాలకు తగిన ప్రాధాన్యత, హక్కులు దక్కేలా తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తనను అణిచివేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసినా తాను వెనకడుగు వేయబోనని తేల్చి చెప్పారు.