తెలంగాణలో జర్నలిస్టుల అరెస్టులు మరియు దానికి సంబంధించి ఉన్నతాధికారులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. టీజీఎస్ఆర్టీసీ ఎండీ వి.సి. సజ్జనార్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక జారీ చేసారు. ఇటీవల రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్టుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో, పోలీసు అధికారుల తీరుపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “ఎమర్జెన్సీ కాలం ఉంటే అందరూ జైల్లో ఉండేవారు” అంటూ సీపీ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కొందరు అధికారులు పరిధి దాటి మాట్లాడుతున్నారని కేటీఆర్ పరోక్షంగా చురకలంటించారు. అధికారులు తమ వృత్తిధర్మాన్ని విస్మరించి రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నారని, ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. “ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది” అంటూ అధికారులకు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు.
Finance: కోలుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ ఖజానా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ క్రీడలో అధికారులు బలవుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ అధికారులు శాశ్వతంగా ఉంటారని, అధికార పక్షానికి కొమ్ముకాస్తూ చట్ట వ్యతిరేక పనులకు పాల్పడవద్దని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు విని తమ కెరీర్‌ను నాశనం చేసుకోవద్దని, రేపు ప్రభుత్వం మారితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం అధికారులను పావుల్లా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
వచ్చే రెండున్నరేళ్లలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రస్తుత నిరంకుశ పోకడలకు సహకరించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. “ఎవరెక్కడుండాలో కాలమే నిర్ణయిస్తుంది” అని వ్యాఖ్యానించడం ద్వారా, తప్పుడు నిర్ణయాలు తీసుకున్న అధికారులపై భవిష్యత్తులో కఠిన చర్యలు ఉంటాయనే సంకేతాలను పంపారు. చట్టాన్ని అతిక్రమించి ప్రతిపక్షాలను, జర్నలిస్టులను వేధించే వారి చిట్టా తమ వద్ద ఉందని ఆయన హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com