తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ (RTA) విధించే సర్వీస్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇతర అనుమతులపై పలు ఛార్జీలు ఈ నెల 28వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయం వాహనదారులపై ఆర్థిక భారం మోపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లైసెన్స్, ఫిట్నెస్, రిజిస్ట్రేషన్ ఛార్జీల వివరాలు
సేవల వారీగా చూస్తే.. లెర్నింగ్ లైసెన్స్ సర్వీస్ ఛార్జీ రూ. 200, మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌కు రూ.300గా నిర్ణయించారు. నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల లైసెన్స్‌కు తాజాగా రూ.400 వసూలు చేయనున్నారు. ఇక ట్రాన్స్‌పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలను రూ.250 నుంచి రూ.500కి పెంచారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఇప్పటి వరకు వసూలయ్యే రూ.200ను ఇప్పుడు రూ.300గా నిర్ణయించారు.
వాహనదారుల్లో ఆందోళన
ఈ ఛార్జీల పెంపుతో సామాన్య వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంధన ధరలు, బీమా, ఇతర నిర్వహణ ఖర్చులు ఇప్పటికే భారం పెడుతున్న వేళ, ప్రభుత్వం ఇలా సర్వీస్ ఛార్జీలు పెంచడం అన్యాయమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సేవల మెరుగుదల లేకుండా ధరలు పెంచడం సరైందేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే తీరుతో ఆర్టీఏ మరింత వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉంది.
Read Also : Cardamom Milk : పాలల్లో యాలకులను మరిగించి తాగితే ఎన్నో లాభాలు..!