తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్ (BRS)లకు టికెట్ల కేటాయింపు వ్యవహారం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ‘రెబల్స్’ బెడద ఇరు పార్టీల అధిష్టానాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్న నేతల సంఖ్య పెరగడంతో, అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలకు సొంత పార్టీ నేతల నుంచే ముప్పు పొంచి ఉంది. పార్టీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా చాలా చోట్ల స్వతంత్రులుగా నామినేషన్లు వేయడం అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరియు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీల్లోని అంతర్గత కుమ్ములాటలపై దృష్టి సారించారు. రెబల్స్ వల్ల ఓట్లు చీలిపోయి ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూరుతుందన్న ఆందోళనతో, వారిని బుజ్జగించేందుకు పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగారు.
TG: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్..
ముఖ్యంగా మహబూబ్ నగర్, జగిత్యాల, గద్వాల్, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం మరియు కొత్తగూడెం వంటి కీలక మున్సిపాలిటీల్లో రెబల్స్ బెడద తీవ్రంగా ఉన్నట్లు నివేదికలు అందుతున్నాయి. ఈ జిల్లాలకు చెందిన పార్టీ ఇన్ఛార్జ్లతో మహేశ్ కుమార్ గౌడ్ మరియు కేటీఆర్ విడివిడిగా భేటీ అయ్యారు. ఎవరెవరు రెబల్స్‌గా బరిలో ఉన్నారో, వారిని ఎలా ఒప్పించాలో అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారు పార్టీకి విధేయులుగా ఉంటే భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీలు ఇస్తున్నట్లు సమాచారం. లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతానికి నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో, అందరి దృష్టి ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణపైనే ఉంది. ఫిబ్రవరి 3వ తేదీనే విత్‌డ్రా చేసుకోవడానికి ఆఖరి గడువు కావడంతో, ఈ కొద్ది రోజులు రాజకీయంగా అత్యంత కీలకం కానున్నాయి. అప్పటివరకు రెబల్స్ వెనక్కి తగ్గకపోతే పార్టీ గెలుపు అవకాశాలపై దెబ్బ పడే అవకాశం ఉంది. పార్టీ హైకమాండ్ నేరుగా అసంతృప్త నేతలతో ఫోన్లలో మాట్లాడుతున్నారని, వారిని రేసు నుంచి తప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఫిబ్రవరి 3 నాటికి ఎంతమంది రెబల్స్ సైలెంట్ అవుతారో, ఎంతమంది మొండిగా ముందుకు వెళ్తారో వేచి చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com