హైదరాబాద్ (Hyderabad) నగరంలో శుక్రవారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షంతో నగరం తడిసి ముద్దైంది. ఆఫీసుల ముగింపు సమయానికి వాన మొదలవడంతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ భారిగా నిలిచిపోయింది. ముఖ్యంగా మాసాబ్ ట్యాంక్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పాట్నీ నాలా పొంగి.. బోట్లలో తరలింపు
వర్షం తీవ్రత కారణంగా పాట్నీ నాలా పొంగి పరిసర ప్రాంతాల్లోకి నీరు చేరింది. పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలో నీరు ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో DRF (Disaster Response Force) సిబ్బంది బోట్ల సహాయంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నీటమునిగిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపేశారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షణలో సహాయ చర్యలు
సహాయక చర్యలన్నింటినీ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దించి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయం అందిస్తున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన వేళ 100 లేదా 040-29555500 నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు. వర్షం మరికొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అతి అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Read Also : BRS : 100 సీట్లతో అధికారంలోకి వస్తాం – కేటీఆర్