తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య మరియు పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్‌చిట్ ఇవ్వడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ మారిన విషయం జగమెరిగిన సత్యమని, స్వయంగా వారే కండువాలు కప్పుకున్నా ఆధారాలు లేవనడం విడ్డూరంగా ఉందంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
Talasani : తలసానిపై కేసు.. వివాదం ఏంటి?
కేటీఆర్ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు కోటి సాక్ష్యాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. బహిరంగంగానే వారు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాలు చూపుతూ ఫిర్యాదులను కొట్టివేయడం పవిత్రమైన శాసనసభను అవమానించడమే అని ఆయన మండిపడ్డారు. ఇది కేవలం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కాకుండా, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమేనని కేటీఆర్ ఆరోపించారు.
ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. దేశంలో రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పే రాహుల్ గాంధీ, తెలంగాణలో మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని, పార్టీ మారిన ‘జంప్ జిలానీలకు’, ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. న్యాయ పోరాటంతో పాటు ప్రజల పక్షాన ఈ అక్రమాలను ఎండగడతామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com