హైదరాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా(Pradhan Mantri Fasal Bima Yojana) (పంటల బీమా) యోజనను తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం అమలు చేయకపోవడమే రైతులకు శాపంగా మారిందని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.
రైతుల కష్టాలు, ఇసుక మేటలతో నష్టపోయిన పంటలు
భారీ వర్షాలతో తీవ్రంగా రైతాంగం నష్టపోయిన కామారెడ్డి జిల్లాలో బిజెపి కిసాన్ మోర్చా, స్థానిక బిజెపి జిల్లా నాయకులతో కలిసి భిక్కనూరు మండలం రామేశ్వరపల్లి, అంతంపల్లి, లక్ష్మీ దేవి పల్లిలో పర్యటించారు. వాగు ఉధృతికి ముంపుకు గురైన పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు.
ఈ సందర్భంగా రైతులు ఇంతవరకు వ్యవసాయ శాఖ అధికారులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ నష్టాన్ని నమోదు చేయడానికి రాకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు రైతులు పొలాల్లో పూర్తిగా ఇసుక మేటలు వేసి సాగుకు పనికి రాకుండా పోయిందని శ్రీధర్ రెడ్డి సమక్షంలో కన్నీటి పర్యంతమయ్యారు.
మీడియాతో మాట్లాడిన శ్రీధర్ రెడ్డి(Sridhar Reddy), రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. గతంలో అనేకసార్లు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, నాటి కెసిఆర్ లాగే రేవంత్ ప్రభుత్వం కూడా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఫసల్ బీమా యోజన లేకపోవడంపై విమర్శలు
పంటల బీమా(Pradhan Mantri Fasal Bima Yojana) యోజన అమలులో ఉంటే రైతులు సహాయం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి పరిహారం పొందే అవకాశం ఉండేదన్నారు. ఈ పాపం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ధ్వజమెత్తారు. వెంటనే రైతులకు జరిగిన నష్టాన్ని రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో నమోదు చేసి ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే, పొలాలలో ఇసుకమేటలు తొలగించడానికి రైతులకు సహాయ కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం రాజు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలతో వరదల కారణంగా రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా, రైతులను ఆదుకోవడానికి సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసి కామారెడ్డికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి(BJP) కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పాపయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు దేవర శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పరి రమేష్, మండల అధ్యక్షుడు జయపాల్ రెడ్డి, ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఏమిటి?
A1: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది రైతులు ప్రకృతి వైపరీత్యాలు, పురుగులు, వ్యాధుల వల్ల పంటలు నష్టపోతే వారికి బీమా ద్వారా ఆర్థిక రక్షణ కల్పించే కేంద్ర ప్రభుత్వ పథకం.
తెలంగాణలో ఫసల్ బీమా యోజన ఎందుకు అమలు కాలేదు?
A2: బిజెపి నేత శ్రీధర్ రెడ్డి ఆరోపణల ప్రకారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు.
ఫసల్ బీమా యోజన రైతులకు ఎలా ఉపయోగపడుతుంది?
A3: ఈ పథకం అమలులో ఉంటే రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి పరిహారం పొందే అవకాశం ఉంటుంది.
Read hindi news: Hindi.vaartha.com
Read Also: