Phone tapping case Telangana: రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఈ కేసులో మొదటి ముద్దాయిగా వుండి, పోలీసు కస్టడీలో వున్న ఎస్ఎఐబి మాజీ బాస్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) ను విచారించిన క్రమంలో వెలుగు చూసిన విషయాల ఆధారంగా బిఆర్ఎస్ హయాంలో కీలక పోస్టుల్లో వున్న వారికి పోలీసులు తాఖీదులు జారీ చేశారు. ఇందులో కొందరు విశ్రాంత ఐఎఎస్లు, ఐపిఎస్ అధికారులను ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్ బృందం విచారించగా మిగతా వారిని రెండు మూడు రోజుల్లో విచారించే వీలుంది. మరోవైపు ప్రభాకర్ రావు మూడవ రోజు విచారణ సోమవారం నాడు జరిగింది.
Read Also: language: సాంస్కృతిక స్పృహలేని భాషాసేవలేల!
ప్రభాకర్ రావును ఏడు గంటలపాటు ప్రశ్నించిన అధికారులు
ఈ విచారణకు రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ సహా మరో ముగ్గురు హాజరై ప్రభాకర్ రావును ఏడు గంటల పాటు భిన్న కోణాల్లో ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సుధీర్ఘంగా సాగే అవకాశాలున్నాయి. 2023 మార్చలో నమోదైన ఈ కేసు విచారణ 20 నెలలుగా సాగుతుండడం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు పోలీసు అధికారులు అరెస్టయి కొన్ని నెలల పాటు జైల్లో వుండి బెయిలుపై విడుదలవడం తెలిసిందే. మరో నిందితుడు శ్రవణ్ రావు ముందస్తు బెయిల్ తీసుకోగా వేరే కేసులో ఆయనను పోలీసులు ఆరెస్టు చేయడం గమనార్హం. అయితే ఈ కేసులో కీలక నిందితుడు మొదటి ముద్దాయి(The first defendant)గా వున్న నాటి ఎస్వీబి బాస్ ప్రభాకర్ రావు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ కారణంగా దాదాపు ఏడాది పాటు పోలీసులు అరెస్టు చేయలేక పోయారు.
నాటి బాస్ లకు పోలీసుల తాఖీదులు
ఆయన ముందస్తు బెయిల్ను రద్దు వేయాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు కస్టడీ విషయంలో పోలీసులు విజయం సాధించి ఆయనను రెండు వారాల పాటు తమ అదుపులో వుండేలా చేసుకుని విచారణ చేస్తున్నారు. ఈ రెండు వారాల కస్టడీ(Custody) విచారణ ఈ నెల 25వ తేదీతో ముగియనుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 26వ తేదీన ప్రభాకర్ రావును పోలీసులు విడుదల చేయాల్సి వుంది. మరో మూడు రోజులు మాత్రమే ప్రభాకర్ రావును పోలీసులు విచారించే వీలుండడంతో ఈలోపు ఆయన నుంచి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి మరింత సమాచారం రాబట్టాలని సిట్ బృందం భావిస్తుండగా ఆయన మాత్రం తాను ఎస్విబి బాస్ గా పనిచేసిన సమయంలో తన పై అధికారులుగా వున్న చీఫ్ సెక్రటరీలు, డిజిపిలు, నిఘా విభాగం బాస్లు, ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏర్పాటైన రివ్యూ కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించడం సంచలనం రేపింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తానొక్కడినే దోషిని కాదని అప్పట్లో తనకు బాస్లుగా వున్న వారు కూడా దోషులేనని ప్రభాకర్ రావు చెబుతున్నట్లు సమాచారం. వారి ఆదేశాల మేరకే తాను అనేక మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు వెల్లడించినట్లు తెలిసింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అప్పట్లో ఆదేశాలు ఇచ్చిన నాటి చీఫ్ సెక్రటరీలు రాజీవ్ శర్మ, ఎస్కే జోషి, సోమేష్ కుమార్, శాంతి కుమారిలతో పాటు డిజిపిలుగా పనిచేసిన అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్, రవి గుప్తా, నిఘా విభాగం బాస్లుగా వున్న నవీన్ చంద్, అనిల్ కుమార్, అప్పట్లో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐఎఎస్ అధికారి రఘునందన్ రావులను విచారించాలని సిట్ బృందం నిర్ణయించింది. వీరిలో కొందరికి ఇప్పటికే తాఖీదులు జారీ చేసినట్లు సమాచారం తాఖీదులు అందుకున్న వారిలో కొందరు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి తమకు తెలిసిన విషయాలను సిట్ అధికారులకు వెల్లడించినట్లు తెలిసింది.
మరికొందరు ఒకటి రెండు రోజుల్లో సిట్ విచారణకు హాజరయ్యే వీలుందని తెలిసింది. కాగా విశ్రాంత ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల్లో కొందరు నేరుగా సిట్ బృందం ఎదుట విచారణకు రాగా మరికొందరు అనారోగ్య కారణాలతో రాలేని పరిస్థితుల్లో వుండడంతో సిట్ అధికారులు వారి ఇళ్లకు వెళ్లి నాటి ఘటనలపై వాంగ్మూలం తీసుకున్నారు. వాంగ్మూలం ఇచ్చిన అధికారులు అప్పట్లో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి తమ పాత్ర గురించి వివరించారని తెలిసింది. ఈ విషయంలో ప్రభాకర్ రావు(Prabhakar Rao) అతిగా చేశాడని మరికొందరు అధికారులు సిట్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. తాము మావోయిస్టుల పోన్లు మాత్రమే ట్యాపింగ్ అనుమతి ఇస్తే ప్రభాకర్ రావు బృందం రాజకీయ నేతలు, జడ్జిలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, బడా వ్యాపారుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు వారు చెప్పారని తెలిసింది.
ఈ కేసులో తమ పాత్ర నామమాత్రమేనని వారు వెల్లడించారని సమాచారం. అప్పట్లో ప్రభాకర్ రావు సూపర్ పవర్ వెలిగిపోయాడని, పోలీసు శాఖలో ఆయన ఏం చేసినా చెల్లుబాటు అయ్యేదని వారు చెప్పినట్లు సమాచారం. ఇదిలావుండగా ప్రభాకర్ రావు రెండవ దఫా విచారణలో భాగంగా మూడవ రోజు కస్టడీ దర్యాప్తు సోమవారం ముగిసింది. మూడవ రోజు విచారణ ఏడు గంటల పాటు సాగిందని తెలిసింది. ఈ విచారణలో సిట్ బృందంలోని ఐదుగురు అధికారులు పాల్గొని ప్రభాకర్ రావును భిన్న కోణాల్లో విచారించారు. అయితే ప్రభాకర్ రావు చెప్పిన అంశాలనే పదే పదే చెబుతున్నట్లు సమాచారం. మంగళవారం నాడు నాలుగవ రోజు విచారణలో ఈ కేసులో నిందితులుగా వున్న వారిని ఎదురుగా వుంచి విచారించే వీలుందని తెలిసింది. దీంతో పాటు అప్పట్లో బ్యూరోక్రాట్లుగా పనిచేసిన వారి ఎదుట ప్రభాకర్ రావును వుంచి విచారించే వీలుందని సమాచారం. ఈ విచారణకు సిటీ కొత్వాల్ సజ్జన్నార్ స్వయంగా హాజరయ్యే వీలుందని తెలిసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
read also: