Phone tapping: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పెద్ద సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) వ్యవహారం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారుతోంది. ఈ కేసును రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఎంతో కీలకంగా తీసుకుంటోంది. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎస్ఐబీ చీఫ్ టి. ప్రభాకర్ రావు (Prabhakar Rao) తాజాగా ఐదోసారి విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సాగిన విచారణ దాదాపు ఎనిమిది గంటల పాటు కొనసాగినట్లు సమాచారం.
విచారణలో ఏమి జరిగింది?
విచారణలో ప్రభాకర్ రావు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని SIT వర్గాలు భావిస్తున్నాయి. ఆయన స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా, అధికారులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. తాను పనిచేసిన సమయంలో అప్పటి డీజీపీ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశానని, ఈ వ్యవహారంలో నాటి ప్రభుత్వ పెద్దల నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ప్రభాకర్ రావు సిట్‌కు వివరించినట్టు సమాచారం.
ఇతర నిందితుల వాంగ్మూలాలతో విరుద్ధత
ఈ కేసులో మరోవైపు నిందితులుగా ఉన్న ప్రణీత్‌రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న వంటి వారు మాత్రం తామంతా ప్రభాకర్ రావు ఆదేశాల ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను పర్యవేక్షించామని ఇప్పటికే సిట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. కానీ ప్రభాకర్ రావు మాత్రం ఈ బాధ్యతను డీజీపీ లేదా ఇతర అధికారులపై మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారన్నది కీలక విషయమైంది.
మావోయిస్టు అనుమానం – నిజంగా నిఘానేనా?
ప్రభాకర్ రావు గతంలో కొంతమంది వ్యక్తులు మావోయిస్టులకు సహకరిస్తున్నారనే సమాచారంతో కొందరి ఫోన్లు ట్యాప్ చేయాల్సి వచ్చిందని ప్రభాకర్ రావు గతంలో చెప్పారు. దీంతో దానికి సంబంధించిన ఆధారాలు చూపాలని సిట్ కోరడంతో, ఇప్పుడు ఆయన ఉన్నతాధికారుల వైపు వేలెత్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.
తప్పించుకునే వ్యూహమేనా?
దర్యాప్తు వర్గాల అభిప్రాయం ప్రకారం, ప్రభాకర్ రావు ఈ వాదనలతో తన పాత్రను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఒకవైపు ఇతర నిందితులు ఆయన పేరు చెబుతుండగా, ఆయన మాత్రం నెపాన్ని ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.
Read also: Yoga Day 2025: గచ్చిబౌలి స్టేడియంలో యోగా డే వేడుకలు
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్