High Alert : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. పాత బస్తీతో పాటు వివిధ ప్రాంతాలపై పోలీసులు నజర్ పెట్టారు. పర్యాటక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలోని గతంలో టెర్రరిస్టుల దాడులకు గురైన ప్రాంతాలు సహా పలు ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్‌లో పోలీసుల గస్తీని ముమ్మరం
అలాగే హైదరాబాద్‌లో పోలీసుల గస్తీని ముమ్మరం చేయాలని రాష్ట్ర పోలీసు శాఖను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ నెల 25, 26 తేదీల్లో హెచ్‌ఐసీసీ కేంద్రంగా ‘భారత్ సమ్మిట్-2025’, మే 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్-2025 పోటీలు జరగనున్న క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా, పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు ఆయా రాష్ర్టాలను అప్రమత్తం చేశాయి. దేశవ్యాప్తంగా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పడంతో తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే గుర్తించిన స్లీపర్‌సెల్స్‌పై నిరంతరం నిఘా పెట్టాలని ఇంటెలిజెన్స్ విభాగానికి ఆదేశాలు ఇచ్చారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు
మరో వైపు, తిరుమలలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. పహల్గాంలో ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో టీటీడీ.. తిరుమలలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో సెక్యూరిటీని పెంచారు. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుమలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
Read Also: రాష్ట్రంలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రెడ్ అలర్ట్ జారీ