కేంద్ర రవాణా, శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం (మే 5, 2025) తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో కలిసి, రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడే పలు రహదారి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ పర్యటనలో మొత్తం రూ.5,400 కోట్ల విలువైన 26 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఆదిలాబాద్‌లో ప్రారంభ కార్యక్రమాలు
నాగ్‌పూర్ విమానాశ్రయం నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరి గడ్కరీ, 10.15కు కాగజ్‌నగర్ చేరుకుంటారు. అక్కడ 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు రహదారి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ప్రాంతంలో రహదారి వెడల్పు, నూతన బ్రిడ్జ్‌లు, జంక్షన్ల అభివృద్ధి వంటి పనులకు ఆయన భూమిపూజ చేయనున్నారు.
కన్హశాంతి వనం
ఆదిలాబాద్ కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 1 గంటకు గడ్కరీ హైదరాబాద్ శివారులోని కన్హశాంతి వనానికి చేరుకుంటారు. అక్కడ 3.30 వరకు గడ్కరీ పర్యటించి అక్కడి హరిత అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తారు. ఆ ప్రాంతాన్ని పర్యావరణ దృష్టితో అభివృద్ధి చేయాలని కేంద్రం యోచన చేస్తోంది. కన్హశాంతి వనం పర్యటన అనంతరం గడ్కరీ బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ అంబర్‌పేట సమీపంలో నిర్మించిన ప్రధాన ఫ్లైఓవర్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ ట్రాఫిక్ నియంత్రణకు, ప్రజలకు వేగవంతమైన రవాణా అవకాశాలు కల్పించనుంది.
657 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులకు వర్చువల్ శంకుస్థాపన
అంతే కాకుండా నితిన్ గడ్కరీ మరో ముఖ్య ఘట్టాన్ని వర్చువల్ ద్వారా చేపడతారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.657 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 21 కిలోమీటర్ల పొడవు గల 7 ప్రాజెక్టులకు ఆయన వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేస్తారు. ఇందులో నూతన రహదారులు, చొరదారులు, నగరాల మధ్య కనెక్టివిటీ మెరుగుపరచే ప్రణాళికలు ఉన్నాయి. అనంతరం సాయంత్రం 6 గంటలకు అంబర్‌పేట మున్సిపల్ మైదానంలో జరిగే బహిరంగ సభలో గడ్కరీ పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
Read also: Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం.. సిబిల్ స్కోర్ తప్పనిసరి!