News Telugu: బంగాళాఖాతం నుంచి తీరాన్ని దాటిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం మధ్య చత్తీస్‌గఢ్ ప్రాంతంలో కొనసాగుతోంది. ఇది సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు చక్రవాత ఆవర్తనాన్ని సృష్టిస్తోంది. ఈ ప్రభావం నైరుతి దిశగా వాలుతూ ఉండగా, తూర్పు ఆగ్నేయ దిశలో మధ్య బంగాళాఖాతం వరకు ఋతుపవన ద్రోణి కొనసాగుతోంది. దీంతో తెలంగాణ (Telangana)లో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయి.
ఈరోజు వర్షాలు కురిసే జిల్లాలు
ఈ ప్రభావంతో శుక్రవారం (ఈ రోజు) తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రేపటి వర్షాల అంచనా
శనివారం (రేపు) మరింత విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్ (Adilabad), కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు.
ఈదురు గాలుల ప్రభావం
రెండు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
గత రెండు రోజుల వర్షపాతం రికార్డు
బుధవారం నుండి గురువారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. కేవలం 24 గంటల్లోనే సగటు వర్షపాతం 5.08 సెంటీమీటర్లు నమోదు కాగా, గురువారం రాత్రి ఒక్కరోజే 2.5 సెంటీమీటర్లు వర్షం కురిసింది.
వర్షపాతం గణాంకాలు
నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఇప్పటి వరకు 8 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 10 జిల్లాల్లో అధిక వర్షపాతం, 15 జిల్లాల్లో సాధారణ స్థాయి వర్షపాతం నమోదయ్యాయి. సాధారణంగా ఆగస్టు 28 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సగటున 55.19 సెంటీమీటర్లు వర్షం పడాలి. అయితే ఇప్పటివరకు 69.17 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అంటే సాధారణ స్థాయికి మించి దాదాపు 25 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు అయినట్టైంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: