తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లోని మొత్తం 2,981 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. సుమారు 12,944 మంది అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును తేల్చే ఈ లెక్కింపు ప్రక్రియ కోసం రాష్ట్రవ్యాప్తంగా 123 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పారదర్శకత కోసం ప్రతి కౌంటింగ్ హాల్‌లోనూ వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
AP : మా ప్రాజెక్టుల్ని ఏపీ ఎందుకు అడ్డుకుంటోంది ? – సీఎం రేవంత్
మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత క్రమపద్ధతిలో సాగుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం, సాధారణ బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేస్తారు. ఒక్కో టేబుల్ వద్ద వార్డుల వారీగా బాక్సులను ఉంచి, బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున కట్టలుగా కడతారు. ఇలాంటి కట్టలన్నింటినీ కలిపి ప్రతి వెయ్యి ఓట్లను ఒక రౌండ్‌గా పరిగణిస్తారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను అభ్యర్థుల ఏజెంట్లకు స్పష్టంగా చూపిస్తూ, వారి సమక్షంలోనే అభ్యర్థుల వారీగా ఓట్లను వేరు చేస్తారు. దీనివల్ల లెక్కింపులో ఎలాంటి తప్పులకు తావులేకుండా పక్కాగా ఫలితాలు వెల్లడవుతాయి.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున కేంద్రాల వద్ద జనసమూహాలను నియంత్రించారు. మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య మరియు ఓట్లు తక్కువగా ఉండటంతో మధ్యాహ్నం లోపే ఫలితాలు వచ్చే అవకాశం ఉండగా, కార్పొరేషన్ల పూర్తి స్థాయి ఫలితాలు సాయంత్రం లోపు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు ఈ నెల 16న పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు, అదే రోజు మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎంపిక కోసం పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com