Congress : బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం రజతోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీనే మొదటి శత్రువు అని కేసీఆర్ మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అనే సంగతి కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఏరు దాటేదాకా ఎల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే విధంగా కేసీఆర్ వైఖరి ఉందని విమర్శించారు.
సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం
సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని నిండు అసెంబ్లీలో కేసీఆరే చెప్పారని గుర్తుచేశారు. ఆరోజు సోనియా గాంధీని దేవత అని కూడా సంబోధించారని అన్నారు. కేసీఆర్ రెండు నాల్కల ధోరణికి నిరసనగా.. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని కాంగ్రెస్ శ్రేణులను కోరారు. కేసీఆర్ అన్నట్లు కాంగ్రెస్ పార్టీ విలన్ అయితే.. ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం అయ్యేదా? అని ప్రశ్నించారు. సోనియా గాంధీ లేకపోతే.. కేసీఆర్ మూడు చెరువుల నీళ్లు తాగినా తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. సభకు అనుకున్న రేంజ్‌లో జనాలు రాకపోయేసరికి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని.. ఆ అక్కసును కాంగ్రెస్‌పై కక్కారని మండిపడ్డారు.
Read Also : కాంగ్రెస్ నేతలకు మంత్రి పొన్నం కీలక పిలుపు