Maoist Leader Abhay: అభయ్ కొత్త అడుగుఅడవిబాట నుంచి అన్న ఒడికి

Read Time:  1 min
Maoist Leader Abhay: అభయ్ కొత్త అడుగుఅడవిబాట నుంచి అన్న ఒడికి
FONT SIZE
GET APP

45 ఏళ్ల తర్వాత పెద్దపల్లిలో అభయ్ భావోద్వేగ కలయిక!

రూ.2 కోట్ల రివార్డు ఉన్న మావోయిస్టు నేత… ఎస్పీ ప్రొటెక్షన్‌తో స్వగ్రామ ప్రవేశం

తపంచా నుంచి ఏకే–47 వరకు… ఇక శాంతి మార్గంలో అభయ్ కొత్త అడుగు

కిషన్ జీ తమ్ముడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు అభయ్… కుటుంబంతో కన్నీటి కలయిక

ఆపరేషన్ కగార్ తర్వాత కీలక మలుపు…
జనజీవన స్రవంతిలో కలిసిన అభయ్

Read Also: Ramachandra Rao: రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పేదల ఇళ్ల కూల్చివేత

Maoist Leader Abhay: నాలుగున్నర దశాబ్దాల పాటు సాయుధ పోరాట మార్గంలో అలుపెరగని ప్రయాణం చేసిన మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, ఎట్టకేలకు తన సొంత గూటికి చేరుకున్నారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో 60 మంది సాయుధ నక్సల్స్‌తో జనజీవన స్రవంతిలో కలిసిన ఆయన, లొంగిపోయిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామమైన పెద్దపల్లికి చేరుకున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్పీ ప్రత్యేక ప్రొటెక్షన్‌లో మహారాష్ట్ర పోలీసుల కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన తన అన్న మల్లోజుల ఆంజనేయులను కలుసుకునేందుకు పెద్దపల్లిలోని భరత్ నగర్ నివాసానికి రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.పెద్దపల్లి కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో పని చేసి రిటైర్ అయిన మల్లోజుల ఆంజనేయులు ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారు. దాదాపు 45 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన అన్నను, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కలుసుకున్న వేణుగోపాల్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్నాళ్లూ అడవి బాటలో గడిపిన ఆయన, ఇప్పుడు జనజీవనంలోకి వచ్చి తన వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు.

రాడికల్ స్టూడెంట్ నుండి పొలిట్ బ్యూరో వరకు…


మల్లోజుల వేణుగోపాల్ విప్లవ ప్రస్థానం విద్యార్థి దశలోనే మొదలైంది. నిజాం విముక్తి పోరాటంలో తన తండ్రి కేశోరాం సిమెంట్ కర్మాగారం కార్మికుడిగా ఉంటూనే పోరాటాల్లో కీలక పాత్ర పోషించగా, ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తనయుడు సమసమాజ స్థాపన కోసం సాయుధ మార్గం ఎంచుకున్నాడు. పీపుల్స్ వార్ ఆవిర్భావానికి ముందు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆరఎస్‌యు) ఆర్గనైజర్‌గా ఏమ్, వి పేరుతో ప్రస్థానాన్ని ప్రారంభించారు. నడుముకు తపంచా తగిలించుకుని, సైకిల్‌పై ప్రయాణిస్తూ విద్యార్థులకు సిద్ధాంత బోధన చేసేవారు. పొరెడ్డి వెంకన్న దళంలో సభ్యునిగా అడవి బాట పట్టిన ఆయన, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకాలో పార్టీ బాధ్యతలు చేపట్టారు. తన క్రమశిక్షణతో పార్టీలో కేంద్ర కమిటీ సభ్యునిగా, ఆపై పొలిట్ బ్యూరో సభ్యునిగా ఎదిగారు. భూపతి, సోనుదాదా, అభయ్ వంటి పేర్లతో దశాబ్దాల పాటు క్రియాశీలకంగా వ్యవహరించారు. మొదట్లో తపంచా వాడిన ఆయన, కాలక్రమేణా ఏకే-47 పట్టారు.

ఒకే ఇంట ఇద్దరు విప్లవకారులు


పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధునమ్మ దంపతుల ముగ్గురు కుమారుల్లో వేణుగోపాల్ చిన్నవాడు. తండ్రి కేశోరాం సిమెంట్ కర్మాగారంలో పని చేశాడు. ప్రస్తుతం అతని తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. మల్లోజుల కోటేశ్వర్ రావు (కిషన్ జీ), వేణుగోపాల్ రెండో అన్న అయిన కిషన్ జీ, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఉంటూ 2011లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యారు. కిషన్ జీ భార్య కల్పన కూడా ఇటీవల అనారోగ్య కారణాలతో తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు. వేణుగోపాల్ భార్య తారా (అహేరీ తాలూకాకు చెందిన వారు) కూడా ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోయారు.

మలుపు తిప్పిన ఆపరేషన్ కగార్


కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ వల్ల దండకారణ్యంలో మావోయిస్టుల కార్యకలాపాలు స్తంభించాయి. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు (బసవరాజ్) ఎన్‌కౌంటర్ తర్వాత పార్టీలో తీవ్ర చర్చలు జరిగాయి. ఆయుధాలను వదిలేసి ప్రజలతో మమేకం కావడం మంచిదన్న అభయ్ నిర్ణయాన్ని తెలంగాణ కమిటీ తప్పుపట్టినప్పటికీ, బస్తర్ నార్త్ డివిజన్, గడ్చిరోలి డివిజన్ కమిటీలు ఆయనను సమర్థించాయి. చివరకు 22 పేజీల లేఖలో తన అభిప్రాయాలను వెల్లడిస్తూ, అభయ్ తన సహచరులతో కలిసి జనజీవన స్రవంతిలో కలిశారు. కాగా, ఆయనపై రూ.2కోట్ల రివార్డు ఉంది.
శాంతియుత మార్గంలో తన కుటుంబం మధ్యకు చేరిన ఈ మాజీ విప్లవ యోధుడిని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. అనంతరం మల్లోజుల వేణుగోపాలరావు తిరిగి మహారాష్ట్ర పోలీసులతో వెళ్లిపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.