Mahabubnagar: తెలంగాణ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి తలపెట్టిన “అర్రైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం మహబూబ్‌నగర్ టౌన్ లోని వాసవి డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ డి.జానకి యువతను ఉద్దేశించి రోడ్డు భద్రతపై సమగ్ర అవగాహన కల్పించారు. యువతలో సరైన అవగాహన ఉంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, సమాజం మొత్తం సురక్షిత దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు.
Read Also: Telangana: అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసిన మల్లు భట్టివిక్రమార్క
జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం
డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది ప్రమాదాలను ముందుగానే ఊహించి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం అని ఎస్పీ గారు వివరించారు. డ్రైవింగ్ సమయంలో చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించడం, ఇతరుల తప్పిదాలను ముందుగానే అంచనా వేయడం, వేగ నియంత్రణలో ఉంచడం, సురక్షిత దూరం పాటించడం వంటి అలవాట్లు ప్రాణాలను కాపాడతాయని తెలిపారు. మొబైల్ ఫోన్ వినియోగం, అలసట లేదా నిద్రాహార స్థితిలో డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు మరియు వెనుక ప్రయాణికులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ స్ట్రాప్ సరిగా బిగించుకోవాలని సూచించారు. కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించడం ద్వారా ప్రమాద సమయంలో ప్రాణ రక్షణ పొందవచ్చని చెప్పారు. ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్ వంటి అలవాట్లు యువత ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
బ్లైండ్ స్పాట్స్‌ను గుర్తుంచుకోవాలని
మద్యం సేవించి వాహనం నడపడం శిక్షార్హ నేరమే కాకుండా ప్రాణాలకు ప్రమాదకరమని, స్పందన వేగం తగ్గి ప్రమాదాల అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. భారీ వాహనాల సమీపంలో ప్రయాణించేటప్పుడు బ్లైండ్ స్పాట్స్‌ను గుర్తుంచుకోవాలని, ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేయకూడదని, ముందుకు అకస్మాత్తుగా ప్రవేశించవద్దని చెప్పారు. కార్యక్రమ ప్రారంభంలో కళాబృందం సభ్యులు రోడ్డు ప్రమాదాల తీవ్రతను వివరించగా, అనంతరం ఎస్పీ పిపిటి ప్రజెంటేషన్ ద్వారా ఇటీవల జరిగిన ప్రమాదాలు, వాటి కారణాలు, డ్రైవింగ్ సమయంలో చేసిన తప్పిదాలను విద్యార్థులకు వివరించారు. ఇకముందు ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు చేయకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం మరియు డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.
యువత రోడ్డు భద్రత నియమాలను పాటిస్తే ఒక తరం మొత్తం సురక్షిత జీవన విధానాన్ని అలవరచుకుంటుందని, మీ జాగ్రత్తే మీ కుటుంబానికి రక్షణ అని ఎస్పీ గారు సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ అజాజుద్దీన్, ఉమెన్ పీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ కొండా స్వామి, అకాడమిక్ డైరెక్టర్ రజినీకాంత్, కరస్పాండెంట్ శ్రీనివాసయ్య, షీ టీం సభ్యులు, కళాబృందం సభ్యులు, ఐటీ కోర్ టీం, ఎస్‌ఐ రవి మరియు సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: