తెలంగాణలో మద్యం ధరల పెంపు దిశగా ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే బీర్ల ధరలు పెంచిన తర్వాత, ఇప్పుడు ఇతర మద్యం రకాలపై కూడా ధరలు పెంచే యోచనలో ఉంది. అయితే, సామాన్యులు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్‌పై ధరలు పెంచే ఆలోచన లేదని అధికారులు వెల్లడించారు. బాటిల్ రేటు రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్‌పై కనీసం 10 శాతం ధర పెంచే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు సంవత్సరానికి సుమారు రూ.2,000 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మార్కెట్ డిమాండ్, ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న ధరల ఆధారంగా రేట్ల పెంపు
మద్యం ధరల పెంపుకు సంబంధించి అధికారుల వద్ద రెండు నుండి మూడు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. మార్కెట్ డిమాండ్, ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న ధరల ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రత్యేక కమిటీ నివేదికను సమర్పించగా, బీర్ల ధరలపై ఫిబ్రవరిలో 15 శాతం పెంపు జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా, ఇతర లిక్కర్ రకాలపై కూడా మార్పులు రావొచ్చని భావిస్తున్నారు.
టెట్రా ప్యాక్‌లలో మద్యం అమ్మకాలు
ఇక మరో కీలక అంశంగా, టెట్రా ప్యాక్‌లలో మద్యం అమ్మకాలను ప్రవేశపెట్టే ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం చర్చిస్తోంది. ఈ విధానం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గి, కొంత మేర వినియోగదారులకు ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ విధానాన్ని మొదట మహబూబ్‌నగర్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశముంది. మొత్తంగా, మద్యం ధరల పెంపు ప్రక్రియ మందుబాబుల్లో కలకలం రేపుతున్నా, చీప్ లిక్కర్ ధరలు మారకపోవడం వారికి ఊరట కలిగిస్తోంది.