తెలంగాణలో వానలు విపరీతంగా కురుస్తున్నాయి. ఆగస్టు నెల ప్రారంభం నుంచి మొదలైన వర్షాలు ఇప్పుడు కుండపోతగా కురుస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి మరింత తీవ్రతరంగా మారింది. అనేక జిల్లాల్లో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతుండగా, రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం వంటి జిల్లాలు అత్యంత తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. వర్షాలు ఆగకపోవడంతో వరదల బీభత్సం మరింత పెరిగింది.భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్లలోకి నీరు చేరిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు మునిగిపోయాయి. రవాణా వ్యవస్థ (Transportation system) పూర్తిగా దెబ్బతింది. ప్రధాన రహదారులు, లోకల్ రోడ్లు తెగిపోవడంతో ప్రజలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లలేకపోతున్నారు. నగరాల్లోనూ పరిస్థితి అంతే. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో చీకట్లలో ఇబ్బందులు పడుతున్నారు.
కేసీఆర్ ఆందోళన,కేటీఆర్‌కు కీలక ఆదేశాలు
ప్రజల ఇబ్బందులపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వరదల బీభత్సం నేపథ్యంలో పార్టీ నేతలతో నిరంతరం ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని అంచనా వేసి, ప్రజలకు సహాయక చర్యలు అందేలా చూడాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ, ఈ క్లిష్ట సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.కేసీఆర్ తన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆహారం, త్రాగునీరు, వైద్య సహాయం అందించే దిశగా ముందడుగు వేయాలని ఆయన ఆదేశించారు. వరద కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సాయం అందించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేయాలని సూచించారు.
మెుద్దు నిద్ర
ఇక భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైపోతుంటే సర్కార్ మాత్రం మెుద్దు నిద్ర నిద్రపోతుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతుంటే.. సీఎం రేవంత్ మాత్రం బిహార్ ఎన్నికల యాత్రలో బిజీ అయిపోయారని ట్వీట్ చేశారు. ‘భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతున్నది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారు. సీఎం మాత్రం తీరిగ్గా బిహార్‌లో ఎన్నికల యాత్ర చేస్తున్నాడు. ఎప్పుడొస్తాయో తెలియని బిహార్ ఎన్నికల కోసం తెలంగాణకు సంబంధమే లేని బిహార్ ఎన్నికల కోసం తెలంగాణ సీఎం, మంత్రివర్గం కాంగ్రెస్ అధిష్ఠానం ముందు మోకరిల్లింది. అధిష్ఠానం ఆశీస్సులతో.. పదవులు కాపాడుకుని ఖజానా కొల్లగొట్టే ధ్యాస తప్పితే ఆరు గ్యారంటీలు 420 హామీల అమలు గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు.
సహాయక చర్యలు
వరదలతో ప్రజలు.. యూరియా దొరక్క రైతులు.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. చాలా చోట్ల వరదనీటిలో మునిగి ప్రజలు హెలికాప్టర్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో ప్రైవేట్ జెట్లలో ఊరేగుతున్న కాంగ్రెస్ సీఎం, మంత్రులకు ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్‌ల కన్నా అధ్వాన్నంగా 100 కిలోమీటర్ల లోపు ప్రభుత్వ కార్యక్రమాలకు హెలికాప్టర్‌ను వినియోగిస్తున్న ఈ నేతలకు ఇప్పుడైనా హెలికాప్టర్ పంపి ప్రజల ప్రాణాలు రక్షించే తీరిక ఉందో, లేదో ? కాంగ్రెస్ నేతలారా.. ఓట్లు కాదు ప్రజల పాట్లు చూడండి. ఎన్నికలు కాదు.. ఎరువుల కోసం రైతుల వెతలు చూడండి. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి.’ అని డిమాండ్ చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: